వివేకా హత్య కేసు చుట్టూ ఏపీ రాజకీయం
వై.ఎస్.రాజశేఖర రెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వై.ఎస్. వివేకానంద రెడ్డి హత్యకు గురై రెండేళ్లు దాటిపోయింది. అయినా ఈ హత్య చేసిందెవరో ఇంతవరకూ తేలలేదు. మొదట సీఐడీ విచారణకు ఆదేశించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన కోర్టు తీర్పు మేరకు దీన్ని సీబీఐ చేతుల్లో పెట్టింది. సీబీఐ కూడా పలుమార్లు కడప, పులివెందుల్లో పర్యటించి విచారణ జరిపింది. కానీ ఇంతవరకూ ఈ కేసులో ఎలాంటి పురోగతీ లేదు. దీంతో ఈ కేసును త్వరగా తేల్చాలంటూ ఆయన కుమార్తె సునీత పోరాడుతోంది.
రెండేళ్లు దాటినా కూడా ఈ కేసు కొలిక్కి రాకపోవడంపై వై.ఎస్. వివేకానంద రెడ్డి కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఏకంగా ఢిల్లీ వెళ్లి సీబీఐ అధికారులను కలిసారు. దీని వెనుక ఎవరున్నారో త్వరగా తేల్చాలంటూ విజ్ఞప్తి చేశారు. ఓ మాజీ ముఖ్యమంత్రి తనయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి బాబాయ్ హత్యనే ఇంతవరకూ తేల్చకపోతే ఇక సామాన్యులకు న్యాయం ఎక్కడ జరుగుతుందని ఆమె ప్రశ్నించారు. ఢిల్లీలో ఆమె ప్రెస్ మీట్ పెట్టి మరీ పలు ఆశక్తికర వ్యాఖ్యలు చేశారు. షర్మిల తనకు అండగా ఉన్నారన్నారు సునీత. సీబీఐకి అప్పగించడం జగన్ కు ఇష్టం లేదన్న ఆమె.. తన పిటిషన్ తర్వాతే కోర్టు కేసును సీబీఐకి అప్పగించిందని గుర్తుచేశారు. బాబాయ్ హత్యను జగన్ సీరియస్ గా పట్టించుకోకపోవడం వల్లే ఢిల్లీ వరకూ రావాల్సి వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
సునీత ఢిల్లీ పర్యటన వివేకా హత్య కేసును మళ్లీ తట్టి లేపినట్లయింది. సునీత చేసిన వ్యాఖ్యల ఆధారంగా అన్ని పార్టీలూ మళ్లీ వివేకా హత్య కేసుపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. తిరుపతి పర్యటనలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. అధికారంలో ఉన్న జగన్.. వివేకా హత్య కేసును ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రశ్నించారు. వివేకా హత్య వెనుక ఎవరున్నారో జగన్ రెడ్డికి తెలీదా అని నిలదీశారు. బీజేపీ కూడా అదే అడుగుతోంది. అటు టీడీపీ కూడా వివేకా హత్య కేసును పక్కదారి పట్టించేందుకే సీఎం ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తోంది.
కానీ వైసీపీ మాత్రం విపక్షాల ఆరోపణలను తిప్పికొడుతోంది. వివేకా హత్య జరిగినప్పుడు రాష్ట్రంలో టీడీపీయే అధికారంలో ఉందని.. అప్పుడు ఏం చేశారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అప్పుడు పట్టించుకోని టీడీపీ నేతలు ఇప్పుడు ఆరోపణలు చేయడం సరికాదంటున్నారు. నాడు టీడీపీతో కలిసి పనిచేసిన జనసేన.. అప్పుడు ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. వివేకా హత్య కేసులో దోషులు ఎంతటివారైనా శిక్ష పడక తప్పదని స్పష్టం చేస్తున్నారు. మరి ఈ కేసు ఎప్పుడు తేలుతుందో చూడాలి.













