కులం కార్డ్…
ఏపీరాజకీయాలు కులం చుట్టూరా తిరుగుతున్నాయి. టీడీపీ, వైసీపీ, జనసేన.. కులమంత్రాన్ని ప్రయోగిస్తున్నాయి. అయితే అందరికన్నా ఎక్కువగా జనసేనాని పవన్.. బీసీ ఓట్లు కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. వారాహి యాత్రలో భాగంగా కత్తిపూడిలో జరిగిన సమావేశంలో కాపుసామాజికవర్గాన్ని తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నించారు. రిజర్వేషన్ ఇవ్వమని చెప్పిన జగన్ కు గత ఎన్నికల్లో వైసీపీ బీసీ నేతలు మద్దతుగా నిలిచారని.. ఫలితంగా వైసీపీ గెలిచిందన్నారు.
ఈసారి తనను నమ్మాలని… ఒంటరిగా గెలిచేంత మద్దతివ్వాలని కోరారు. ఉభయగోదావరి జిల్లాల్లో 15 సీట్లు, రాష్ట్రవ్యాప్తంగా మరో 15 సీట్లు గెలిస్తే.. ఏపీలో తానే కింగ్ మేకర్ కావొచ్చని పవన్ భావిస్తున్నారు. సమయం అనుకూలిస్తే, కింగ్ గానూ మారే అవకాశాలున్నట్లు అభిప్రాయపడుతున్నారు . అందుకే పవన్.. పదేళ్లు తనకు అవకాశమివ్వాలని.. రెండేళ్ల తనపాలన నచ్చకుంటే, తానే నేరుగా రాజీనామా చేస్తానని చెబుతున్నారు.
మరోవైపు టీడీపీ.. తమకు బీసీలే వెన్నెముక అని.. మొదటి నుంచి వారి అండదండలతోనే పార్టీ సాగుతోందని చెబుతోంది. అంతేకాదు.. పార్టీలో ఎప్పుడు బీసీనేతలకు పెద్దపీట వేస్తూ వస్తున్నామని ఉదహరిస్తోంది. అందుకు ఇప్పుడు తమ పార్టీతో పాటు , ఇతరపార్టీల్లో చేరిన మాజీ టీడీపీనేతలను గుర్తు చేస్తోంది. టీడీపీతోనే అణగారిన వర్గాలకు మేలు కలుగుతుందంటూ ప్రచారపర్వాన్ని కొనసాగిస్తోంది. ఇదేమీ ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో చంద్రబాబు…. యువగళం పాదయాత్రలో లోకేష్ సైతం.. ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.
ఇక వైసీపీసైతం కులం ఓట్లపై గంపెడాశలు పెట్టుకుంది. గతంలో ఉభయగోదావరి జిల్లాతో పాటు పలుచోట్ల పెద్దసంఖ్యలో బీసీలు, కాపులు వైసీపీకి ఓటేసిన విషయాన్ని పార్టీనేతలు ప్రస్తావిస్తున్నారు. దీంతోనే బీసీలు, కాపులు ఏపార్టీవైపు ఉన్నారో అందరికీ అర్థమవుతుందని చెబుతున్నారు. ఎవరు ఎన్ని వేషాలు వేసినా.. మళ్లీ బీసీలు, కాపులు.. వైసీపీకే పట్టం గడతారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. పనిలో పనిగా పవన్ టార్గెట్ గా విరుచుకుపడుతున్నారు. చంద్రబాబు దగ్గర బీసీ ఓట్లను తాకట్టు పెట్టేందుకు పవన్ ప్రయత్నిస్తున్నాడంటూ ఆరోపిస్తున్నారు. ఏదేమైనా ఏపీలో మాత్రం కులరాజకీయం ఆసక్తి కలిగిస్తోంది.













