Kakani: కనపడకుండా పోయిన కాకాని
మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి(Kakani) వ్యవహారం ఇప్పుడు నెల్లూరు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. క్వార్ట్జ్ ఖనిజ నిక్షేపాల విషయంలో ఆయన అనుసరించిన వైఖరి పై తీవ్రస్థాయిలో ఆరోపణలు ఉన్నాయి. దీనితో ఆయనపై పలు కేసులు పోలీసులు నమోదు చేశారు. ఖనిజ నిక్షేపాలను అక్రమంగా తవ్వుకున్నారు అనే ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. సర్వేపల్లి నియోజకవర్గంలో పాటగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఆయన పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని అప్పట్లో టిడిపి(TDP) ఆరోపణలు చేసింది.
ఇప్పుడు వాటిపై కేసులు కూడా నమోదు చేశారు. ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక కాకాని గోవర్ధన్ రెడ్డి తో పాటుగా మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి. ఈ సమయంలో ఆయన అజ్ఞాతవానికి వెళ్లిపోయారు. సోమవారం ఉదయం ఆయన 11 గంటలకు విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ ఎక్కడున్నారో, ఏమయిపోయారో కూడా తెలియదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నానని పోలీసులు చెప్తున్నారు.
ఇక ఆయన పిల్లలు కూడా ఫోన్ లు స్విచ్ ఆఫ్ చేసుకోవడంతో అసలు ఏం జరుగుతుంది అనేదే ఆసక్తిని రేపుతోంది. ఇక హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. దీనిపై మంగళవారం విచారణ జరగనుంది. ఇప్పటికే పలువురు మాజీ మంత్రులను వేటాడుతున్న ఏపీ ప్రభుత్వం.. కాకాని గోవర్ధన్ రెడ్డి విషయంలో కూడా కాస్త సీరియస్ గానే కనపడుతుంది. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి కాస్త ఘాటుగానే మాట్లాడారు.
వైసీపీ నేతలను అరెస్టు చేసిన సమయంలో వారిని పరామర్శించేందుకు ఆయన జైలు వద్దకు కూడా వెళ్లి వచ్చారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు తర్వాత ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనితో ఆయనపై కూటమి ప్రభుత్వం కాస్త గట్టిగా ఫోకస్ పెట్టే పరిస్థితి వచ్చింది అంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఏది ఎలా ఉన్నా కాకాని వ్యవహారం మాత్రం ఇప్పుడు నెల్లూరు జిల్లాలో హాట్ టాపిక్ అవుతుంది.













