షర్మిల పోటీ చేసే స్థానంపై కాంగ్రెస్ క్లారిటీకి వచ్చేసిందా..?
దివంగత నేత వైఎస్. రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల రాజకీయ ప్రస్థానం ఎన్నో మలుపులు తీసుకుని చివరకు ఆంధ్రప్రదేశ్ కే చేరింది. కాంగ్రెస్ పార్టీ ఆమెకు పగ్గాలు అప్పగించడంతో రాజకీయం రసవత్తరంగా మారనుంది. సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధ్యక్షుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో బద్ద వ్యతిరేక పార్టీ అయిన కాంగ్రెస్ కు సోదరి షర్మిల పీసీసీ చీఫ్ గా నియమితులవడం మరింత ఆసక్తి కలిగిస్తున్న అంశం. ఒకే కడుపున పుట్టిన ఇద్దరు వ్యక్తులు ఈ ఎన్నికల్లో హోరాహోరీ తలపడబోతున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఆసక్తి కలిగిస్తోంది.
షర్మిల రాజకీయ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రాజశేఖర రెడ్డి మరణానంతరం కాంగ్రెస్ పార్టీతో విభేదించింది వైఎస్ ఫ్యామిలీ. జగన్ సొంత పార్టీ పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో జగన్ పై కేసులు పెట్టి జైలుకు పంపడం.. జగన్ పాదయాత్రను షర్మిల కొనసాగించడం.. అనంతరం ఏపీలో పార్టీ అధికారంలోకి రావడం.. జగన్ కు షర్మిలకు మధ్య విభేదాలు తలెత్తడం.. ఆమె తెలంగాణలో పార్టీ పెట్టడం.. చివరకు దాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం.. లాంటివి మనకు తెలిసిన విషయాలే. ఇప్పుడు షర్మిల ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టడంతో రాజకీయం కీలక మలుపులు తిరగబోతోంది.
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్పినట్లు షర్మిల ఇప్పుడు నడుచుకోవాల్సి వస్తుంది. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పతనానికి జగనే కారణమని ఆ పార్టీ హైకమాండ్ గట్టిగా నమ్ముతోంది. దీంతో ఎలాగైనా అతనిపై కక్ష తీర్చుకోవాలనుకుంటుంది. ఇప్పుడు తన సోదరి రూపంలోనే కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఆయుధం దొరికింది. అదే ఆయుధాన్ని ప్రయోగించడం ద్వారా జగన్ ను ఓడించాలనుకుంటోంది. అందుకోసం షర్మిలను ఎక్కడ నుంచి బరిలోకి దింపాలనేదానిపై పార్టీ హైకమాండ్ తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు సమాచారం.
అయితే షర్మిల పోటీ చేసే స్థానంపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఆమెను పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయించాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నట్టు సమాచారం. అదే జరిగితే జగన్, షర్మిల మధ్య హోరాహోరీ పోరు నడుస్తుంది. విజయమ్మ ఎవరి వైపు మొగ్గు చూపితే అటు విజయావకాశాలు ఉంటాయి. ప్రస్తుతం షర్మిల వెంటే విజయమ్మ ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. ఇక కడప పార్లమెంటు స్థానం నుంచి వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీతను బరిలోకి దింపే అవకాశం ఉందని సమాచారం. షర్మిలకు, సునీతకు మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. సునీతను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని కడప పార్లమెంటు బరిలో నిలిపితే అవినాశ్ రెడ్డికి తద్వారా జగన్ కు చెక్ పెట్టవచ్చని పార్టీతో పాటు షర్మిల ఆలోచిస్తున్నట్టు సమాచారం.













