ఫిబ్రవరిలో ఏపీ పంచాయతీ ఎన్నికలు?
కొవిడ్ కారణంగా ఆంధప్రదేశ్ రాష్ట్రంలో వాయిదా పడిన స్థానిక ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ కీలక ప్రకటన విడుదల చేశారు. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఆలోచన చేస్తున్నట్లు సృష్టం చేశారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకున్నామని గుర్తు చేశారు. రాష్ట్రంలో కరోనా ఉద్ధ•తి కూడా తగ్గుముఖం పట్టిందని, రోజుకు నమోదయ్యే కేసుల సంఖ్య 10 వేల నుంంచి 753కి తగ్గిందన్నారు. ఈ నేపథ్యంలో పార్టీలకు అతీతంగా జరిగే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు న్యాయపరమైన ఇబ్బందులు లేనందున వాటిని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలైందని ఈ సందర్భంగా ఎస్ఈసీ ప్రస్తావించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో లేదని, పోలింగ్‌కు నాలుగు వారాల ముందు కోడ్ అమల్లోకి వస్తుందని ఆయన సృష్టం చేశారు. ఎన్నికలపై ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, అధికారులు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఈ ఎన్నికలు రాజ్యాంగపరమైన అవసరమే కాకుండా కేంద్ర ఆర్థిక సంఘం నిధులు తీసుకునేందుకూ దోహదపడతాయని చెప్పారు. కరోనా పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆరోగ్యశాఖతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తామని రమేశ్ కుమార్ పేర్కొన్నారు.













