సార్వత్రిక ఎన్నికలకు ముందే శుభవార్త
సార్వత్రిక ఎన్నికలకు ముందుగానే ఉద్యోగులకు శుభవార్త చెబుతానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అన్ని డిమాండ్లు, సమస్యలు తన దృష్టిలో ఉన్నాయని, వాటిలో అవకాశం ఉన్న వాటన్నింటినీ నెరవేరుస్తానని సృష్టం చేశారు. ఆర్థికమంత్రి, ఉద్యోగ సంఘాల నేతలతో మరోసారి భేటీ అయిన తర్వాత నిర్ణయాన్ని వెల్లడిస్తానన్నారు. విజయవాడ జ్యోతి కన్వెన్షన్ హాల్లో జరిగిన ఏపీ ఎన్జీవో మాజీ అధ్యక్షుడు అశోక్‌బాబు ఆత్మీయ వీడ్కోలు సభలో ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా ప్రసంగించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఉద్యోగులు అర్థం చేసుకోవాలని కోరారు. తెలంగాణ ఉద్యోగులకు తక్కువ కాకుండా అన్ని సదుపయాలు కల్పిస్తానన్నారు. విభజన సమయంలో వారితో సమానంతో 43 శాతం ఫిటిమెంట్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ విషయంలో కేంద్ర తనపై కన్నెర్ర చేసిందని, కేంద్ర సహకరించి ఉంటే ఉద్యోగులు ఆశించిన దానికన్నా ఎక్కువగా చేసేవాడినన్నారు. జీడీపీలో ఏపీ దేశంలోనే నంబర్ వన్‌గా ఉండటానికి ఉద్యోగులు రేయింబవళ్లు పడిన కష్టమే కారణమని కొనియాడారు. ఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు అశోక్‌బాబుకు ఎమ్మెల్సీ ఇస్తున్నట్టుగా చంద్రబాబు ప్రకటించారు.













