అసలోడు వచ్చే వరకూ కొసరోడికి పండగే..! లోకేశ్‌కు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఝలక్..!!
తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర అట్టహాసంగా కొనసాగుతోంది. రాయలసీమలో లోకేశ్ యాత్రకు మంచి స్పందన రావడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. నెల్లూరు జిల్లాలో పలువురు వైసీపీ నేతలు పార్టీలో చేరడంతో నేతల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. ఇప్పుడు ఆయన యాత్ర ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది. ప్రకాశం జిల్లాలో టీడీపీకి మంచి పట్టుంది. ఈసారి కూడా ఆ పట్టును నిలుపుకుంటామనే నమ్మకం టీడీపీ శ్రేణుల్లో కనిపిస్తోంది. కొండపిలో యాత్ర పూర్తి చేసుకున్న నారా లోకేశ్ ఒంగోలులోకి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. అయన యాత్ర ఒంగోలులో ప్రవేశించకముందే.. ఆయనకు వ్యతిరేకంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పెద్ద షాక్ ఇచ్చారు.
ఒంగోలులో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అర్ధరాత్రి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఇప్పుడు టీడీపీలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్.. అసలోడు వచ్చేవరకూ కొసరోడికి పండగే.. అనే కొటేషన్లతో పలుచోట్ల ఈ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. సీనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు ఫోటోలను కూడా వీటిలో ఉంచారు. అసలోడు అంటే జూనియర్ ఎన్టీఆర్ పార్టీలో యాక్టివ్ అయ్యేవరకూ కొసరోడు అంటే నారా లోకేశ్ కు పండగే.. అనే అర్థం వచ్చేలా ఈ ఫ్లెక్సీలున్నాయి. వీటిని కచ్చితంగా వైసీపీ వాళ్లే ఏర్పాటు చేసి ఉంటారని టీడీపీ శ్రేణులు అనుమానిస్తున్నాయి. స్థానిక టీడీపీ నేతలు వెంటనే వీటిని తొలగించేశారు.
2009 వరకూ జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలో కీలక పాత్ర పోషించారు. ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత నారా లోకేశ్ పార్టీలో యాక్టివ్ కావడంతో చంద్రబాబు కావాలనే జూనియర్ ఎన్టీఆర్ ను పక్కన పెట్టారనే ఆరోపణలున్నాయి. కుటుంబపరంగా కూడా వాళ్ల మధ్య అంత సఖ్యత కనిపించడం లేదు. అయితే టీడీపీలో కొందరు నేతలు జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి వస్తే బాగుంటుందని భావిస్తున్నారు. అవునన్నా కాదన్నా జూనియర్ ఎన్టీఆర్ కు ఉండే క్రేజ్ వేరు. నందమూరి హీరోల్లో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ దే హవా. ఆ తర్వాతే బాలకృష్ణ. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ సేవలను పార్టీకి వాడుకోవాలని సూచిస్తున్నారు. ఆ మధ్య కుప్పంలో కొందరు నేతలు నేరుగా చంద్రబాబుకే ఈ విషయం చెప్పారు. ఆయన నవ్వుతూ సమాధానం దాటవేశారు.
జూనియర్ ఎన్టీఆర్ ను చంద్రబాబు తొక్కేశారని పలువురు భావిస్తున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇప్పుడు సినిమాల్లో బిజీగా ఉండడం వల్ల పార్టీకి సేవలందించలేకపోతున్నానని.. సమయం వచ్చినప్పుడు కచ్చితంగా పార్టీ కోసం పని చేస్తానని పలు సందర్భాల్లో చెప్పారు. అయితే ఎప్పటికైనా టీడీపీని గట్టెక్కించాలంటే అది ఒక్క జూనియర్ ఎన్టీఆర్ వల్లే సాధ్యమవుతుందని చాలా మంది నమ్ముతున్నారు. అందుకే టీడీపీలో పలువురు నేతలు అడపాదడపా జూనియర్ ఎన్టీఆర్ జపం చేస్తూ ఇలా హడావుడి చేస్తున్నారు.













