Amaravati: మోదీ పర్యటనతో అమరావతి పనులు ఊపందుకుంటాయి
ప్రధాని మోదీ పర్యటనతో అమరావతి (Amaravati)లో పనులు మరింత ఊపందుకుంటాయని ఆంధ్రప్రదేశ్ మంత్రులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా మే 2న సాయంత్రం 3 గంటలకు మోదీ గన్నవరం చేరుకుంటారని చెప్పారు. ప్రధాన పర్యటన ఏర్పాట్లపై మంత్రులు నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్, నారాయణ, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం నారాయణ (Narayana) మీడియాతో మాట్లాడుతూ ప్రధాని వచ్చి వెళ్లేవరకు చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించామన్నారు. సభావేదిక వద్దకు చేరుకునేందుకు 7 రహదారులు ఉన్నాయని, అన్ని మార్గాల్లోనూ వేదిక వద్దకు చేరుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అధికారులందరికీ బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. వేదికపై మోదీ గంటపాటు ఉంటారని తెలిపారు. గత ఐదేళ్ల రాజధాని రైతులను అప్పటి ప్రభుత్వం ఇబ్బందులు పెట్టిందని, అందువల్ల రైతులను కూడా గౌరవించుకోవాలని నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) అన్నారు. గత ప్రభుత్వం రాజకీయ కక్షతో పోలవరాన్ని, అమరావతిని నిలిపివేసిందని పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) మండిపడ్డారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ సహకారంతో పోలవరం పనులు పున ప్రారంభమయ్యాయని, అమరావతి పనులను కూడా తిరిగి ప్రారంభించేందుకు ప్రధాని ఇక్కడికి వస్తున్నారని తెలిపారు. మే 2న రూ.లక్ష కోట్ల అభివృద్ధి పనులను మోదీ ప్రారంభిస్తారని అన్నారు.













