Amaravati : ప్రధాని మోదీ అమరావతి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి : మంత్రి నారాయణ
ప్రధాని మోదీ (Prime Minister Modi) అమరావతి (Amaravati) పర్యటనకు ఏర్పాట్లు దాదాపు 90 శాతం పూర్తయ్యాయని మంత్రి నారాయణ (Narayana) తెలిపారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లను అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడుతూ మిగిలిన పనులను రేపటికి పూర్తిచేస్తామని చెప్పారు. రూ.43 వేల కోట్ల పనులను ప్రధాని చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుంది. రాజధాని కోసం కేవలం 50 రోజుల్లో ఒక్క సమస్య కూడా లేకుండా రైతులు భూములు ఇచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో రాజదాని కట్టాలని సీఎం దిశానిర్దేశం చేశారు. సింగపూర్ (Singapore) సహకారంతో మాస్టర్ ప్లాన్ రూపొందించాం. 365 కి.మీ ట్రంక్ రోడ్లు, 1500 కి.మీ లే ఔట్ రోడ్లు నిర్మించేలా ప్లాన్ ఉంది. గతంలోనే రూ.41 వేల కోట్లకు పనులు ప్రారంభమయ్యాయి. 2019కు ముందు రూ.5 వేల కోట్ల బిల్లుకు కూడా చెల్లించాం. గత ప్రభుత్వం రాజధానిపై మూడు ముక్కలాట ఆడిరది. న్యాయపరమైన సమస్యలు లేకుండా ముందుకెళ్లేందుకు ఇంత సమయం పట్టింది. మూడేళ్లలో రాజధాని పనులు పూర్తి చేస్తాం. సోమవారం అమరావతి ప్రాంత రైతులతో సీఎం రెండుగంటలపాటు మాట్లాడారు. 29 గ్రామాల రైతులను ప్రధాని సభకు రావాలని సీఎం స్వయంగా ఆహ్వానించారు. అమరావతిపై పార్లమెంట్ (Parliament )లో చట్టం చేయాలని రైతులు కోరారు.ఈ అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సీఎం సూచించారు అని తెలిపారు.













