Amaravati: ప్రధాని మోదీ అమరావతి పర్యటన.. ఏర్పాట్లు పూర్తి : మంత్రి నారాయణ
రాజధాని అమరావతి (Amaravati )లో ప్రధాని మోదీ (Prime Minister Modi) పర్యటన నేపథ్యంలో 90 శాతం ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర మంత్రి నారాయణ (Narayana) తెలిపారు. రాజధానిలో మోదీ పర్యటన ఏర్పాట్లను మంత్రి, ఉన్నతాధికారులు పరిశీలించారు. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడుతూ వచ్చే నెల 2న ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతి పనులు పున: ప్రారంభమవుతాయని చెప్పారు. సభా వేదిక వద్దకు వచ్చేందుకు 8 రోడ్లు, 11 పార్కింగ్ ప్రాంతాల్ని గుర్తించినట్లు తెలిపారు.
ఈ సంరద్భంగా ఎయిర్పోర్టు (Airport) అంశంపై మంత్రి స్పందించారు. హైదరాబాద్ (Hyderabad)లో ఒక ఎయిర్పోర్టు ఉంది. అయినా శంషాబాద్ నిర్మించాం. ఇప్పుడు రెండో ఎయిర్పోర్టు లేకుంటే హైదరాబాద్లో 10 శాతం విమానాలు కూడా దిగేవి కాదు. రానున్న 100 ఏళ్లను దృష్టిలో పెట్టుకొని సీఎం అమరావతి నిర్మాణం చేస్తున్నారు. స్మార్ట్ ఇండస్ట్రీస్ (Smart Industries) వస్తేనే అభివృద్ధి జరుగుతుంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఉంటేనే స్మార్ట్ ఇండస్ట్రీస్ వస్తాయి. దీనికి అదనపు ల్యాండ్ పూలింగ్ విషయంలో స్థానిక ప్రజా ప్రతినిధులతో మాట్లాడుతున్నాం. ప్రజలు ల్యాండ్ ఫూలింగ్కు అంగీకరిస్తే చేస్తాం. లేదంటే భూసేకరణపై ఆలోచిస్తాం. పెరిగిన భూముల విలువ నిలవాలన్నా, పెరగాలన్నా ప్రజలు ఉండాలి. ప్రజలు లేకపోతే భూముల విలువ పడిపోతుంది అని తెలిపారు.













