Narayana: హైదరాబాద్ తరహాలో విశాఖలో నిర్మిస్తాం : మంత్రి నారాయణ
భోగాపురం ఎయిర్‌పోర్టు (Bhogapuram Airport) వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తి అవుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారాయణ (Narayana) తెలిపారు. రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులపై మంత్రి మీడియాతో మాట్లాడారు. ఈ ఎయిర్‌పోర్టును అనుసంధానం చేస్తూ 22 రోడ్లు ప్రతిపాదించామని, వాటిలో 15 రోడ్లు పూర్తి అవుతున్నాయని తెలిపారు. 115 రోజుల్లో మిగిలిన ఆరు రోడ్లకు సంబంధించి ప్రణాళిక సిద్ధం చేసి, జాతీయ రహదారి సంస్థతో సమన్వయం చేసుకొని పూర్తి చేస్తామని చెప్పారు. టిడ్కో ఇళ్లు (Tidco Houses) పూర్తి చేయాలంటే రూ.7 వేల కోట్లు కావాలి. వైసీపీ హయాంలో అప్పులు చేసి వాటిని పక్కదారి పట్టించారు. 2014-2019 మధ్య 7లక్షల టిడ్కో ఇళ్లు ప్రతిపాదించాం. అవి వైసీపీ హయాంలో ఆగిపోయాయి. కేవలం 2 లక్షల ఇళ్లు కూడా పూర్తి చేయలేకపోయారు. ఎంత ఖర్చయినా మహిళలకు టిడ్కో ఇళ్లు ఇవ్వాలని సీఎం చంద్రబాబు (Chandrababu) సంకల్పించారు. ఈ దసరా (Dussehra)కి టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తామన్నారు.
ప్రతి ఇంటికి నీరిచ్చేలా 2021లో అమృత్ పథకం కోసం కేంద్రం నిధులిస్తే వైసీపీ ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదు. ఆ నిధులు వెనక్కి వెళ్లిపోయాయి. సీఎం చంద్రబాబు కేంద్రంతో మాట్లాడి మళ్లీ నిధులు వచ్చేలా చేశారు. రూ.834 కోట్ల పనులు అమృత్ పథకం (Amrit Scheme) కోసం నిర్దేశించాం. కొద్ది నెలల్లో అమృత్ పథకం ద్వారా సర్ఫేస్ వాటర్ వస్తాయి. విశాఖ మెట్రోకి సంబంధించి అక్టోబర్ నెలలో పనులు మొదలు పెడతాం. డబుల్ డెక్కర్ మెట్రో కింద డీపీర్ ఇచ్చాం. కోటి మంది ప్రజలు ఉన్న హైదరాబాద్‌కు రింగురోడ్డు ఉంది. అదే తరహాలోనే విశాఖలో సెమీ రింగ్‌రోడ్డు నిర్మిస్తాం అని తెలిపారు.













