Free Bus: ఈ పథకం ద్వారా ప్రతి తల్లికి, చెల్లికి లబ్ధి : మంత్రి మండిపల్లి

గత ప్రభుత్వం ఆర్టీసీని విచ్చిన్నం చేసిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డి (Ramprasada Reddy) మండిపడ్డారు. పథకం అమలుకు సంబంధించి విధివిధానాలు విడుదలైన సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. అన్ని ఒడిదొడుకులను ఓర్చుకొని కూటమి ప్రభుత్వం మహిళలకు స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు (Free bus) ప్రయాణం అమలు చేస్తుంటే వైసీపీ (YCP) ఓర్చుకోలేకపోతోందన్నారు. మహిళలకు మేలు చేస్తుంటే జగన్(Jagan) సొంత మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి తల్లికి, చెల్లికి లబ్ధి చేకూరుస్తామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ సీసీ కెమెరాలు (CC cameras) ఏర్పాటు చేస్తున్నాం. ప్రయాణికుల సౌకర్యవంతమైన ప్రయాణం కోసం సిబ్బందిని పెంచుతున్నాం. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఈ పథకం పూర్తిస్థాయిలో అమలులో ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, మెట్రో, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సేలే 74 శాతం నడుస్తున్నాయి. వాటిలోనే ఎక్కువమంది మహిళలు ప్రయాణిస్తున్నారు. అందుకే ఆ బస్సుల్లోనే ఉచిత ప్రయాణాన్ని అమలు చేసి ఎక్కువ మందికి లబ్ధి చేకూరుస్తున్నాం. నాన్ స్టాప్, సూపర్ లగ్జరీ, ఏసీ తరహా బస్సులు పరిమిత సంఖ్యలోనే ఉన్నాయి. ఆర్టీసీ స్థితిని దృష్టిలో ఉంచుకొని, పథకం దీర్ఘకాలం నిలబడేలా ఆర్థిక సమతుల్యతతో పథకం అమలు చేస్తున్నాం. దీని ద్వారా లక్షలాది మహిళలు ఉద్యోగాలు, విద్య, వైద్య సేవల కోసం ఉచితంగా ప్రయాణించే అవకాశం పొందనున్నారు అని తెలిపారు.