Kollu Ravindra: ప్రతి ఆటో డ్రైవర్‌కు త్వరలో రూ.10 వేలు :మంత్రి కొల్లు
అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ కింద మూడు విడతల్లో రైతులకు రూ.20 వేల ఆర్థికసాయం అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra ) అన్నారు. శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) పలాస లో మంత్రి పర్యటించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కొల్లు రవీంద్ర మాట్లాడుతూ తొలి విడత కింద త్వరలోనే రైతుల ఖాతాల్లో రూ.7 వేలు జమ చేస్తామని చెప్పారు. ప్రతి ఆటో డ్రైవర్ (Auto driver)కు త్వరలో రూ.10 వేలు ఇచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటికే రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన చాలా సంస్థలు తిరిగి వస్తున్నాయని చెప్పారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునేందుకు వైసీపీ (YCP) నాయకులు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని, కులమతాలు, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే గౌతు శిరీష(Gauthu Sirisha) తో పాటు స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.







