మమ్మల్నే అంటారా? తెలంగాణపై మండిపడ్డా ఏపీ మంత్రి
తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఏపీ నీటిపారుదల శాఖా మంత్రి అనిల్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. ఏపీకి కేటాయింపులు ఉన్న నీటిని వాడుకోవడానికి ప్రాజెక్టులు కట్టుకుంటున్నామని, వాటిని అక్రమమని చెప్పడం ఎంత వరకు సమంజసమని తీవ్రంగా అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రమే ఎలాంటి అనుమతులు లేకుండా ప్రాజెక్టులను చేపడుతోందని కౌంటర్ ఇచ్చారు. కేటాయింపుల కంటే అదనంగా నీటిని వాడుకోవడానికే కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులను నిర్మిస్తున్నారని మండిపడ్డారు. అనవసరంగా తాము అక్రమ ప్రాజెక్టులు కడుతున్నామని తెలంగాణ ఆడిపోసుకుంటోందని, రాయలసీమ లిఫ్ట్, రాజోలిబండ ప్రాజెక్టులు చట్టాలకు లోబడే కడుతున్నామని తేల్చి చెప్పారు. ఇలా కట్టడం ఎలా తప్పవుతుందని నిలదీశారు. 6 టీఎంసీలకు పైగా సామర్థ్యమున్న ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తోందని, పోతిరెడ్డిపాడు వద్ద లిఫ్ట్ పెడితే, తప్పెలా అవుతుందని అనిల్ ప్రశ్నించారు. శ్రీశైలంలో 881 అడుగుల నీరు చేరితేనే పోతిరెడ్డిపాడు నుంచి తీసుకునే అవకాశం ఉంటుందని, 848 అడుగుల నీటి మట్టం ఉంటే చుక్కనీటిని కూడా తాము తీసుకోలేమని వివరించారు. వంశధార ట్రిబ్యునల్ నుంచి నేరడి ప్రాజెక్ట్ కట్టేందుకు అనుమతిని ఇచ్చిందని, త్వరలోనే దానిని ప్రారంభిస్తామని మంత్రి ప్రకటించారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండు రాష్ట్రాలు కలిసుండాలని తాము కోరుకుంటున్నామని, ఒక అడుగు ముందుకు వేసి స్నేహ హస్తం అందించే మనిషి వైఎస్ జగన్ అని మంత్రి అనిల్ కొనియాడారు.













