ప్రవాసాంధ్రుల తక్షణ సేవల కోసం ఎంఆర్సీ
ప్రవాసాంధ్రులకు అవసరమైన సమాచారం, తక్షణ సేవలు అందించే ఉద్దేశంతో దేశంలోనే తొలిసారిగా అత్యాధునిక సౌకర్యాలతో మెగ్రెంట్ రీసోర్స్ సెంటర్ (ఎంఆర్సీ) రూపుదిద్దుకొందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. దీనిలో నిరంతరం పనిచేసే కాల్ సెంటర్ను ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఎంఆర్సీ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. ఏపీ అభివృద్ధిలో ప్రవాసాంధ్రుల పాత్ర కీలమని ఆయన అన్నారు. విదేశాలకు తొలిసారిగా వెళ్లేవారికి ఏపీ ఎన్ఆర్టీ (ప్రవాసాంధ్రుల తెలుగు సంఘం) ఆధ్వర్యంలో నైపుణ్య శిక్షణతో పాటు, అక్కడి తెలుగు సంఘాలకు సంబంధించిన సమాచారం అందిస్తామని వివరించారు. కార్యక్రమంలో ఏపీ ఎన్ఆర్టీ అధ్యక్షుడు వేమూరి రవి, నైపుణ్యాభివృద్ధి సంస్థ సీఈవో సాంబశివరావు, ఎంఆర్సీ డైరెక్టర్ రాజశేఖర్, యూకే, దుబాయ్ కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు.
పర్యాటకం, ఉన్నత చదువులు, ఉద్యోగాల పరంగా తొలిసారి విదేశాలకు వెళ్లే వారి కోసం ప్రవాసాంధ్రుల తెలుగు సంఘం ఆధ్వర్యంలోని ఎంఆర్సీ విస్తృత సేవలు అందించనుంది. విదేశీ పరిస్థితులు, అక్కడి విధివిధానాలపై ముందే అవగాహన కల్పించనుంది. అత్యవసర సమయంలో పాస్పోర్టు సేవలు పొందడం, ట్రాఫిక్ నిబంధనలు, ఆ దేశ ప్రాథమిక చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనుంది.













