సామరస్యంగా పరిష్కరించడమే మా అభిమతం : అనిల్ కుమార్

రాయలసీమ అభివృద్ధికి ఉపయోగపడే పోతిరెడ్డిపాడు సామర్థ్యం లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటుకు టీడీపీ నేతలు మద్దతివ్వకుండా ఏపీని మోసం చేస్తున్నారని ఏపీ నీటిపారుదల మంత్రి అనిల్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. జూమ్ మీటింగులకే టీడీపీ నేతలు పరిమితమై, ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. నీటి విషయంలో తెలంగాణ ప్రభుత్వం అనవసరంగా రాద్ధాంతాలు చేస్తోందని, ఇచ్చిన మాట ప్రకారమే తాము నీటిని వాడుకుంటున్నామని ప్రకటించారు. తమ హక్కుల ప్రకారమే నీటిని వినియోగించుకుంటున్నామని అన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు 881 అడుగుల నీటిమట్టానికి చేరుకోక ముందే తెలంగాణ ప్రభుత్వం అక్రమ కట్టడాల ద్వారా నీటిని వాడేసుకుంటోందని ఆరోపించారు. ఆర్డీఎస్ కుడి కాలువ సక్రమమే అని, తెలంగాణయే అడ్డగోలు వాదనలకు దిగుతోందని ఆక్షేపించారు. ఉభయ రాష్ట్రాల మధ్య ఏర్పడ్డ నీటి తగాదాలను సామరస్యంగా పరిష్కరించాలన్న ధోరణితోనే సీఎం జగన్ ఉన్నారని, అయితే తెలంగాణ మంత్రుల మాటతీరు మాత్రం బాగోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ గురించి, సీఎం జగన్ గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తమకూ అలా మాట్లాడటం వచ్చు కానీ, సామరస్యంగా పరిష్కరించుకుందామని సీఎం జగన్ అన్నారు కాబట్టే, అలా మాట్లాడటం లేదని వివరణ ఇచ్చారు. తమ గురించి, వైఎస్సార్ గురించి తెలంగాణ మంత్రులు మాట్లాడారని, అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య ఏర్పడ్డ జలవివాదాలను సామస్యర పూర్వకంగా పరిష్కరించుకోవాలన్నదే తమ అభిమతమని అనిల్ కుమార్ స్పష్టం చేశారు.