మాదకద్రవ్యాల వాడకంపై ప్రభుత్వం ఉక్కుపాదం : హోంమంత్రి
గంజాయి, ఇతర మాదకద్రవ్యాల విక్రయం, వాడకంపై ఉక్కుపాదం మోపుతున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. గుంటూరులో జీజీహెచ్లో ఏర్పాటు చేసిన రెండు ఆక్సిజన్ ప్లాంట్లను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ డ్రగ్స్ వ్యవహారంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు సరైనవి కాదని అన్నారు. డ్రగ్స్ దిగుమతి అడ్రస్ విజయవాడ పేరిట ఉందని సీఎంను నిందించడం సరికాదన్నారు. గుజరాత్లో డ్రగ్స్ దొరికాయని ప్రధాని మోదీకి లింకు పెడతారా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రతిపక్ష నేతలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాలిబన్లతో రాష్ట్రానికి సంబంధం అంటగడుతూ ప్రతిపక్షాలు, చేస్తున్న వ్యాఖ్యలు అర్థరహితమని కొట్టి పారేశారు. దేశంలో డ్రగ్స్ రాకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. దేశంలోకి పెద్ద ఎత్తున మాదవద్రవ్యాలు రావడం అందరి వైఫల్యంగా భావించాలని అభిప్రాయపడ్డారు. మాదకద్రవ్యాల నిరోధక, నియంత్రణ బాధ్యత ప్రజలందరిపైనా ఉందని అన్నారు.













