ఆ విషయం ప్రతిపక్ష నేతకు తెలియకపోవడం దురదృష్టకరం
ముఖ్యమంత్రి చంద్రబాబుకు జాతీయ స్థాయిలో విశ్వసనీయత ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి చినరాజప్ప అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు పార్టీల నేతలు చంద్రబాబుతో కలిసి వస్తున్నారని తెలిపారు. ఆ విషయం కూడా ప్రతిపక్ష నేత జగన్‌కు తెలియకపోవడం దురదృష్టకరమని అన్నారు. 14 ఏళ్ళు సీఎంగా పనిచేసిన ఘనత చంద్రబాబుదని కొనియాడారు. యునైటెడ్ ఫ్రంట్‌కు సారథ్యం వహించి, ప్రధాన మంత్రి, రాష్ట్రపతి, స్పీకర్‌ను నిర్ణయించిన అనుభవం చంద్రబాబుకు ఉందన్నారు. ఏపీకి అన్యాయం చేయడంతోపాటు, సీబీఐ, ఈడీ, ఐటీ, ఆర్బీఐ వంటి సంస్థలను నిర్వీర్యం చేస్తున్న బీజేపీని ఎదుర్కొంటామని సృష్టం చేశారు.
అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న కాంగ్రెస్‌తో కలిసి పయనిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే 17 పార్టీలు చంద్రబాబుకు మద్దతిచ్చాయన్నారు. ఈ నెల 22న బీజేపీయేతర కూటమి సమావేశానికి అన్ని పార్టీల నేతలు వస్తున్నారని తెలిపారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తమకు మద్దతు తెలిపారని, బీజేపీ తీరును ప్రజలు అసహించుకుంటున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్‌తో పయనించడాన్ని టీడీపీ నేతలు ఆమోదిస్తున్నారని, చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని, ఆ నమ్మకం నేతలు, కార్యకర్తల్లో ఉందని అన్నారు.













