వారికి అదే చివరి రోజు… హోంమంత్రి అనిత హెచ్చరిక
అత్యాచార నిందితులను వదిలే ప్రసక్తే లేదని, కఠినంగా శిక్షిస్తామని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. అమరావతిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ముచ్చుమర్రి కేసులో బాధిత బాలిక కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం అందజేయనున్నట్లు తెలిపారు. మరోచోట అత్యాచారానికి గురైన బాలిక పేరుతో రూ.5 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని వెల్లడించారు. ఆడపిల్లతో అసభ్యంగా ప్రవర్తించిన వారికి అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి పోలీస్స్టేషన్ పరిధిలోని ఎల్లాల గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల బాలికపై మైనర్ బాలురు అత్యాచారం చేశారు. 14 నుంచి 16 ఏళ్లలోపు వయసున్న ముగ్గురు, ఆ చిన్నారిపై ఆత్యాచారానికి పాల్పడి ఇంట్లో చెబుతుందన్న భయంతో హత్య చేసినట్లు సమాచారం. బాలిక ఆచూకీ కోసం పోలీసులు చేపట్టిన గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.













