ఏపీ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ
ఆంధప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అమరావతిలో ఆర్ 5 జోన్ ను ప్రకటిస్తూ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ 355ను సస్పెండ్ చేసింది. నాలుగు వారాల పాటు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. సీఆర్డీయే సెక్షన్ 41 ప్రకారం రాజధాని మాస్టర్ ప్లాన్లో మార్పులు చయాలనుకుంటే స్థానిక సంస్థలు, గ్రామ కమిటీల నుంచి అభిప్రాయాలను సేకరించాలని అమరావతి రైతుల తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. ప్రభుత్వ వాదనను కూడా విన్న హైకోర్టు ప్రభుత్వ ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. తదుపరి విచారణను జూన్ 17కు వాయిదా వేసింది. ఆర్ 5 జోన్ కింద రాజధానిలో 29 గ్రామాల ప్రజలకే కాకుండా గుంటూరు, విజయవాడతో పాటు మంగళగిరి, పెదకాకాని, తాడేపల్లి, దుగ్గిరాల మండలాల వారికి కూడా ఇళ్ల స్థలాలను ఇచ్చేందుకు 1300 ఎకరాలను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులపై రాజధాని రైతులు హైకోర్టును ఆశ్రయించారు. చట్టపరమైన పక్రియ, నిబంధనలు పాటించకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిందని, సీఆర్డీయే సూత్రాలకు వ్యతిరేకంగా పక్రియను చేపట్టిందని పిటిషన్ వేశారు.













