3 రాజధానులపై దూకుడుకి హైకోర్ట్ బ్రేక్..
రాజధాని వికేంద్రీకరణ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దూకుడుకి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కళ్లెం వేసింది. వికేంద్రీకరణ బిల్లు, సిఆర్డీఎ రద్దు బిల్లులపై ఇటీవలే గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో రెట్టించిన ఉత్సాహంతో రాజధాని తరలింపు కార్యకలాపాలకు జగన్ ప్రభుత్వం సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే ఈ రెండు బిల్లుల అమలును నిరోధించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను హైకోర్టు విచారణకు స్వీకరించింది.మంగళవారం వీటిపై విచారించిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం దీనిపై కౌంటర్ దాఖలు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే కౌంటర్ దాఖలుకు ప్రభుత్వానికి సమయం కావాలని కోరడంతో ప్రభుత్వానికి 10 రోజుల గడువు ఇచ్చిన హైకోర్టు, ఆగస్టు 14 వరకూ విచారణను వాయిదా వేసింది. అప్పటి వరకూ రాజధాని విషయంలో యథాతధ స్థితి కొనసాగించాలని ఆదేశాలు ఇచ్చింది.













