ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు .. రెండు నెలల్లో పూర్తి చేయాల్సిందే
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వెళ్లే రహదారిపై వీధి లైట్లు వెలగక, రోడ్లు అస్తవ్యస్తంగా ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వేణుగోపాలరావు ఈ పిటిషన్ దాఖలు చేశారు. వీధి లైట్లు లేకపోవడంతో ఉద్యోగులు, న్యాయవాదులు, కక్షిదారులు ఇబ్బందులు పడుతున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై వాదనలు విన్న ధర్మాసనం ఉద్యోగులు, న్యాయవాదులు, ఇతరుల భద్రతా దృష్ట్యా 60 రోజుల్లోగా విద్యుత్ సరఫరా, రహదారి మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించారు. అయితే, మరమ్మతులు చేసేందుకు ప్రభుత్వ తరపు న్యాయవాది మూడు నెలల సమయం కోరగా, అందుకు ధర్మాసనం నిరాకరించింది. రెండు నెలల్లో పూర్తిచేయాల్సిందేనని సంబంధిత అధికారులను హైకోర్టు ఆదేశించింది.













