హైకోర్టు నోటీసులపై స్పందించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..
2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం ఆంధ్రాలో కూటమి నాయకులు, వైసీపీ నేతల మధ్య తెలియని మాటల వివాదం జరుగుతుంది. నిన్న మొన్నటి వరకు వైసీపీ సానుకూలమైన పత్రికలు టీడీపీ నేతల గురించి కథనాలు రాశారు అని ప్రచారం జరిగింది. ఎన్నికల తర్వాత ఈ సీన్ పూర్తిగా రివర్స్ అయినట్లు కనిపిస్తోంది. మరి ముఖ్యంగా ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇదే విషయాన్ని బలంగా చెప్పడంతో మరొకసారి ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.
తనకు వచ్చిన హైకోర్టు నోటీసులపై స్పందించిన మాజీమంత్రి, వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. తనకు ఇంకా ఎటువంటి నోటీసులు అందలేదని అన్నారు. నోటీసులు అందినప్పుడు న్యాయపరంగా దానికి బదులుస్తానని కూడా పేర్కొన్నారు. అంతేకాదు కొన్ని మీడియా ఛానల్స్ పని కట్టుకొని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి వారికి తగిన సమాధానం చెప్పడం కోసం కోర్టు తరఫున నోటీసులు ఇచ్చినట్లు త్వరలో పరువు నష్టం దావా వేయబోతున్నట్లు హెచ్చరించారు.
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను పెద్దిరెడ్డి ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఫీజ్ కట్టి వైద్యం చేయించుకునే పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కూడా లోపించాయని ఎద్దేవా చేశారు. కక్షపూరిత రాజకీయాలకు నాంది పలుకుతున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం నేతృత్వంలో ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అవుతుందని.. కేవలం రెండు నెలల వ్యవధిలోనే 25 వేల కోట్లు బకాయిలు పడ్డాయని అన్నారు. ఇదే కొనసాగితే రాబోయే రోజులలో ప్రభుత్వ ఆసుపత్రిలో పేదవాడికి వైద్యం అందుతుందో లేదో అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు.













