ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిరచవచ్చని తెలిపింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ ఎన్నికలను సమర్థించిన ధర్మాసనం సింగిల్ జడ్జి ఉత్తర్వులను తోసిపుచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 8న 515 జెడ్పీటీసీ, 7720 ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 10న కౌంటింగ్ నిర్వహించాల్సి ఉండగా హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులతో వాయిదా పడింది.
మొదటి నుంచి ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై హైకోర్టు డివిజన్ బెంచ్‌ని ఎస్ఈసీ ఆశ్రయించింది. డివిజన్ బెంచ్ ఉత్తర్వుల మేరకే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించామని ఎస్ఈసీ తెలిపింది. మళ్లీ ఎన్నికలు నిర్వహించడం ఈ పరిస్థితులలో అసాధ్యంతో పాటు కోట్లాది రూపాయిలు వృధా అవుతాయని ఎస్ఈసీ పేర్కొంది. హైకోర్టు కౌంటింగ్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో న్యాయ పరమైన చిక్కులు తొలగాయి. దీంతో కౌంటింగ్ ప్రక్రియకు ఎస్ఈసీ కసరత్తు ప్రారంభించింది.













