ఏపీలో పరిషత్ ఎన్నికలకు బ్రేక్!
ఆంధ్రప్రదేశ్ లో పరిషత్ ఎన్నికలకు బ్రేక్ పడింది. ఎల్లుండి జరగాల్సిన పరిషత్ ఎన్నికల పోలింగ్ ను నిలిపేస్తూ హైకోర్టు ఆదేశించింది. 21 రోజుల కోడ్ పాటించలేదంటూ టీడీపీ నేత వర్ల రామయ్య వేసిన పిటిషన్ ను విచారించిన హైకోర్టు.. ఈ తీర్పు వెల్లడించింది. అయితే అసలు నోటిఫికేషన్ నే రద్దు చేయాలంటూ బీజేపీ, జనసేన వేసిన పిటిషన్లపై తీర్పు రావాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికల ప్రక్రియను నిలిపేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు నిబంధనల మేరకు 21 రోజుల కోడ్ విధించలేదంటూ టీడీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. సుప్రీంకోర్టు నిబంధనలు పాటించలేదని.. అందుకే నోటిఫికేషన్ రద్దు చేయాలని టీడీపీ నేత వర్ల రామయ్య ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. 21 రోజుల సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించలేదంటూ ఎన్నికల ప్రక్రియను నిలిపేస్తూ ఆదేశాలిచ్చింది. గతంలో ఎన్నికల కోడ్‌కు 21 రోజుల సమయం లేనందున పరిషత్ ఎన్నికలు నిర్వహించలేనని మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చెప్పారు. ఇప్పుడు వర్ల రామయ్య ఇదే అంశాన్ని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఎన్నికల ప్రక్రియను నిలిపేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 15లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
అయితే.. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేసింది ఎన్నికల సంఘం. ప్రభుత్వం కూడా హైకోర్టు తీర్పుపై రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. సింగిల్ బెంచ్ ఆదేశాలను సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించాయి. వీటిపై ఈ రాత్రికి విచారణ జరిగే అవకాశం కనిపిస్తోంది. మరి డివిజన్ బెంచ్ తీర్పు ఎలా ఉంటుందనేది ఉత్కంఠ కలిగిస్తోంది.
బీజేపీ, జనసేనలు కూడా పరిషత్ ఎన్నికలపై పిటిషన్లు దాఖలు చేశాయి. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశాయి. దీనికి సంబంధించిన విచారణ పూర్తయింది. తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.వాస్తవానికి ఎల్లుండి పోలింగ్ జరగాల్సి ఉంది. 10 తేదీన ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. మరి హైకోర్టు బీజేపీ, జనసేన పిటిషన్లపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తి కలిగిస్తోంది.













