రఘురామ కృష్ణరాజుకు హైకోర్టులో చుక్కెదురు

ఎంపీ రఘురామ కృష్ణరాజు వేసిన బెయిల్ పిటిషన్‍ను ఆంధప్రదేశ్ హైకోర్టు కొట్టేసింది. దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం వాదనలు పూర్తి అవడంతో బెయిల్ కోసం సెషన్స్ కోర్టుకు వెళ్లాలని రఘురామకు సూచించింది. ఎంపీనీ సీఐడీ కోర్టులో హాజరు పరచాలని సీఐడీ అధికారులను ఆదేశించింది. నేరుగా హైకోర్టుకు రాకుండా కింది కోర్టుకు వెళ్లాలని తెలిపింది. తనపై సీఐడీ నమోదు చేసిన కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ రఘురామ కృష్ణరాజు హైకోర్టులో హౌజ్‍మోషన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రఘురామ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆదినారాయణ రావు వాదనలు వినిపించారు. ప్రాథమిక విచారణ లేకుండా ఎంపీ అరెస్టును న్యాయవాది తప్పుబట్టారు. రఘురామ అరెస్టుకు సహేతుక కారణాలు లేవని కోర్టుకు వివరించారు. దీనిపై జిల్లా కోర్టును ఎందుకు ఆశ్రయించలేదని న్యాయవాదిని హైకోర్టు న్యాయమూర్తి ప్రశ్నించారు. కేసు తీవ్రత దృష్ట్యా హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని ఆయన కోర్టుకు తెలిపారు.
ఈ క్రమంలో ఎంపీ రఘురామ కృష్ణరాజును సీఐడీ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలోని ఆరో అదనపు కోర్టులో రాఘురామను హాజరు పరచనున్నారు. జగన్ సర్కార్‍పైనా, ప్రభుత్వ పెద్దలపైనా వరుసగా విమర్శల బాణాలు సంధిస్తున్న అధికార పార్టీ ఎంపీ రఘురామ కృష్ణరాజును పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ అరెస్ట్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనమైంది.