ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై.. హైకోర్టు కీలక తీర్పు
ఆంధప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల సందర్భంగా బలవంతపు ఉపసంహరణ, అడ్డగింతలపై విచారణ చేపట్టాలన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలను హైకోర్టు రద్దు చేసింది. ఏకగ్రీవాలపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో స్పందించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విచారణకు ఆదేశించారు. ఎస్ఈసీ ఆదేశాలను సవాల్ చేస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎస్ఈసీ ఆదేశాలపై గతంలోనే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు నేడు తుది తీర్పు వెలువరించింది. గతేడాది నిలిచిపోయిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై ఫాం-10 ఇచ్చిన స్థానాల్లో విచారణాధికారం ఎస్ఈసీకి లేదన్న పిటిషనర్ వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. ఎస్ఈసీ ఆదేశాలను కొట్టివేసిన హైకోర్టు గతంలో ఏకగ్రీవమైన చోట్ల డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశించింది.













