ఏపీ ఎన్నికల కమిషనర్ పై… హైకోర్టు ఆగ్రహం
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు తీర్పును తమకు కావాల్సినట్టుగా ఎన్నికల కమిషన్ అన్వాయించుకుందని పేర్కొంది. చదవటం, అవగాహన చేసుకోవటంలో వైఫల్యం చెందారని సుప్రీంకోర్టు తీర్పును ఇలా అన్వాయించుకోవటం ఆమోదయోగ్యం కాదని తెలిపింది.
సుప్రీంకోర్టు తీర్పులో నాలుగు వారాల సమయం ఇవ్వాలని స్పష్టంగా ఉందని పేర్కొంది. చదవటం, రాయటం, ఇంగ్లీష్ భాషపై అవగాహన ఉన్న సామాన్యుడికి కూడా సుప్రీం తీర్పు అర్థమవుతుందని హైకోర్టు తెలిపింది. ఏపీ ఎన్నికల కమిషనర్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా గతంలో పనిచేశారని, ఆమె సుప్రీం తీర్పును సరైన దృక్పధంలో అర్థం చేసుకోకపోవటం ఆశ్చర్యాన్ని కల్గించిందని పేర్కొంది. ఇటువంటి తరుణంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఆమె అర్హతపై ఆలోచించాల్సి వస్తుందని న్యాయస్థానం అభిప్రాయపడింది.
పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆమె ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారని, సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఆమె వ్యవహరించారని మండిపడ్డారు. సుప్రీం కోర్టు తీర్పుకు విరుద్ధంగా ఏప్రిల్ 1న ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి 10న కౌంటింగ్ ఎలా జరుపుతారని హైకోర్టు ప్రశ్నించింది. ఇది ప్రజాస్వామ్య సూత్రాలకు పూర్తి విరుద్ధమని, ఇటువంటి చర్యలతో రాష్ట్రంలో ప్రజాస్వామిక విలువలు పడిపోతాయని హైకోర్టు పేర్కొంది.













