లిక్విడ్ ఆక్సిజన్ విషయంలో కేంద్రంతో భేటీ అవుతాం : సింఘాల్

ఏపీలో 24 గంటల్లో 21954 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అశోక్ సింఘాల్ ప్రకటించారు. 88 కోవిడ్ కేర్ సెంటర్లలో 13,356 మంది చికిత్స పొందుతున్నారని, 30880 బెడ్లు కోవిడ్ కేర్ సెంటర్లలో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఏపీకి ఆక్సిజన్ ఎలొకేషన్ ఇంకా అవసరం ఉందని సీఎం జగన్ ప్రధాని మోదీకి లేఖ రాశారని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఏపీకి అవసరం ఉన్న లిక్విడ్ ఆక్సిజన్ కోసం కేంద్ర అధికారులతో సమావేశం నిర్వహించాలని తాము భావిస్తున్నామని పేర్కొన్నారు. కొత్తగా దాదాపు 25 క్రయోజనిక్ ట్యాంకర్లను కొనడానికి నిర్ణయం తీసుకున్నామని, 25 ట్యాంకర్లు ఉంటే 500 టన్నులు స్టోరేజీని రవాణా చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. ఇవన్నీ మూడు నుంచి నాలుగు వారాల్లోగా రాష్ట్రానికి అందుబాటులోకి వస్తాయని ఆయన వివరించారు. లిక్విడ్ ఆక్సిజన్‌తో పాటు ఆక్సిజన్ గ్యాస్ ప్లాంట్లు తిరిగి ప్రారంభించామని, 6 ప్లాంట్లలో ఉత్పత్తిని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. 25 టన్నులు అక్కడ ఉత్పత్తి చేస్తున్నామని, దీనిని మరింత పెంచుతామని ప్రకటించారు. మొత్తం 76 టన్నుల ఆక్సిజన్ గ్యాస్‌ను త్వరలో సాధిస్తామని సింఘాల్ ప్రకటించారు.