కరోనా బాధితులు కోలుకునే వరకూ మాదే బాధ్యత : ఆళ్ల నాని
కరోనా బాధితులు పూర్తిగా కోలుకునే వరకూ ప్రభుత్వమే పూర్తి బాధ్యతలు తీసుకుంటుందని ఆరోగ్య మంత్రి ఆళ్లనాని ప్రకటించారు. వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందించేందుకైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఏపీలో కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యింది. ఈ సమావేశానికి మంత్రులు, అధికారులు హాజరయ్యారు. ఆక్సిజన్ సరఫరా, రెమిడేసివిర్ ఇంజక్షన్ల కొరత, పడకల పెంపు, హెల్స్‌డెస్క్ తదితర అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో కొత్తగా 60 కోవిడ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. మరో 33 వేల పడకలు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుమన్నారు. రెమిడేసివిర్ ఇంజక్షన్ ల అక్రమాలను నిరోధించడానికి విజిలెన్స్‌ను ఉపయోగిస్తున్నామని, కరోనా విషయంలో పూర్తిగా అప్రమత్తంగానే ఉన్నామని ప్రకటించారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 62 లక్షల మందికి పైగా వ్యాక్సినేషన్ ఇచ్చామని వెల్లడించారు. కేంద్రం కేటాయించిన 482 టన్నుల ఆక్సిజన్‌ను వాడుకునేందుకు తమ ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. ఆక్సిజన్ కొరత రాకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆళ్ల నాని తెలిపారు.













