ఏపీ హైకోర్టు సంచలన తీర్పు
ప్రభుత్వ కార్యాలయాలకు రాజకీయ పార్టీల జెండా రంగులు వేయడానికి వీల్లేదని ఆంధప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పంచాయతీ కార్యాలయాలకు వైకాపా జెండాను పోలిన రంగులు వేసేందుకు వీలుగా ఆ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ అధికారులు జారీ చేసిన మెమోను రద్దు చేసింది. ఆంధప్రదేశ్‌లోని ప్రభుత్వ, పంచాయతీ, కార్యాలయాలకు వేసిన రాజకీయ పార్టీ రంగులు తొలగించేందుకు తక్షణం చర్యలు చేపట్టాలని ఆదేశించింది. పదిరోజుల్లో ఇదంతా పూర్తిచేయాలని చెప్పింది. రాజకీయ పార్టీలతో సంబంధం లేని రంగును పంచాయతీ / ప్రభుత్వ భవనాలకు వేసేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) మార్గదర్శకాలను రూపొందించాలని తెలిపింది.













