ఏపీ చరిత్రలో ఇదే తొలిసారి….
ఆంధప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒకేసారి 16 మెడికల్ కాలేజీల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమైంది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒకటి చొప్పున ప్రభుత్వ వైద్య కళాశాల ఉండాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ రంగంలో రూ.7,500 కోట్ల వ్యయంతో ఒకేసారి ఏకంగా 16 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం వైద్య విద్యా రంగంలో పెను మార్పులకు దోహదం చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి జగన్ వైద్య విద్యా రంగాన్ని ప్రోత్సహించడాన్ని ప్రభుత్వ సామాజిక బాధ్యతగా చేపట్టి భావితరాల ఉజ్వల భవితకు బాటలు వేస్తున్నారు. ఇప్పటికే కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాలపై పలు సార్లు సమీక్షించి సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. నాణ్యతలో ఎక్కడా రాజీపడరాదని, అంతర్జాతీయ ప్రమాణాలను పాటించాలని సృష్టం చేశారు.
భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఒక్కో మెడికల్ కాలేజీని 50 ఎకరాల్లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మెడికల్ కాలేజీలకు అనుబంధంగా నర్సింగ్ కాలేజీలు కూడా ఏర్పాటవుతాయి. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా 16 మెడికల్ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి.













