Tenecteplase Injection: రూ.40 వేల ‘గుండెపోటు’ ఇంజక్షన్ ఉచితంగా: ఏపీ సర్కారు కీలక నిర్ణయం
మనిషి ప్రాణాలను క్షణాల్లో మింగేసే గుండెపోటు చాలా ప్రమాదకరం. చూస్తుండగానే మనిషి ప్రాణాలను హరించే గుండెపోటు నుంచి ఎవరినైనా కాపాడాలంటే బాధితులకు గుండెపోటు వచ్చిన వెంటనే “టెనెక్టెప్లేస్” ఇంజెక్షన్ (Tenecteplase Injection) ఇవ్వాల్సి ఉంటుంది. అయితే దీన్ని తీసుకోవడం అందిరకీ అంత ఈజీ కాదు. ఎందుకంటే ఈ ఇంజెక్షన్ ఖరీదు రూ.40 వేలకుపైనే. పేదలు, ఆర్థికంగా అవస్థలు పడుతున్నవారికి క్షణాల్లో ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఇలాంటి వారికోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. పేద గుండెకు భరోసా ఇస్తూ రూ.40 వేలు విలువ చేసే టెనెక్టెప్లేస్ ఇంజక్షన్‌ను (Tenecteplase Injection) ఉచితంగా ఇవ్వబోతున్నట్లు ప్రకటన చేసింది.
ఎవరికైనా హార్ట్ ఎటాక్ వస్తే వారికి వెంటనే సీపీఆర్ మొదలు పెట్టేసి, ఆ వెంటనే ఆసుపత్రికి తరలించాలి. అక్కడ “టెనెక్టెప్లేస్” ఇంజక్షన్ (Tenecteplase Injection) ఇవ్వాల్సి ఉంటుంది. ఇదంతా కూడా గుండెపోటు వచ్చిన గంటలోనే జరగాలి. లేదంటే బాధితుల ప్రాణాలు పోవడం దాదాపు ఖాయం.
ఇలా ప్రాణాలను కాపాడే విలువైన “టెనెక్టెప్లేస్” ఇంజక్షన్‌ను పేదలకు ఉచితంగా అందించడానికి ఏపీ సర్కారు చర్యలు తీసుకుంటోంది. గ్రామాల్లో ఎవరికైనా గుండెపోటు వస్తే వారిని సిటీలకు తీసుకురావడానికి చాలా సమయం పడుతుంది. అందుకే వారి సమీపంలో ఉండే కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్‌లోనే టెనెక్టేప్లేస్ ఇంజక్షన్ (Tenecteplase Injection) అందుబాటులో ఉంచాలని సర్కారు భావవిస్తోంది. ఇప్పటికే ఈ ఇంజక్షన్లను పలు సీహెచ్‌సీలకు తరలించి, స్టాక్ ఉంచినట్లు తెలుస్తోంది.













