సెంటు స్థలమే వైసీపీ బ్రహ్మాస్త్రమా..?
ఏపీ రాజకీయం కాక మీదుంది. ఎన్నికల ఏడాది కావడంతో పార్టీలన్నీ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వై నాట్ 175 అంటున్న వైసీపీ అధినేత జగన్ రెడ్డి.. తామే ఎన్నికల్లో గెలుస్తామంటున్నారు. అందుకు తగినట్లుగా పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నారు. మై హూనా అంటూ పార్టీ నేతలకు అభయం ఇస్తున్నారు.
ఓవైపు విపక్షాలన్నీ పొత్తుదిశగా పయనిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. మరీముఖ్యంగా జనసేనాని పవన్.. వైసీపీయే తమ ప్రథమ శత్రువు అని ప్రకటించారు. జగన్ ను గద్దెదించడమే లక్ష్యమంటూ బహిరంగంగా ప్రకటించారు. అంతే కాదు… బీజేపీ, టీడీపీ, జనసేన కలిసికట్టుగా పోటీ చేస్తాయని తేల్చి చెప్పారు. వైసీపీిని అధికార పీఠంపై ఉండకుండా చూస్తామని స్పష్టం చేస్తూ వస్తున్నారు.
ఇటీవలకాలంలో పలుమార్లు చంద్రబాబుతో పవన్ భేటీ అయ్యారు. ఆ తర్వాత హస్తినలో కమలనాథులను కలిశారు.క్రమంగా పొత్తుకు సంబంధించి ప్రకటనలు చేస్తున్నారు. ఈప్రకటనలు… వైసీపీ మేంత్రులు,కార్యకర్తల్లో ఆందోళనకు కారణమవుతున్నాయి. వారు సైతం పవన్ పై విమర్శల దాడి చేస్తున్నారు. అయినా తాడేపల్లి ప్యాలెస్ లో జగన్ మాత్రం.. ప్రత్యేక కార్యాచరణతో దూసుకుపోతున్నట్లు తెలుస్తోంది
పేదలకు గూడు అంటే ఓకల.. అలాంటిది దాన్ని సాకారం చేయగలిగితే, వారి మనసులో చోటు సాధించవచ్చు. అదే ఆలోచనతో సెంటు స్థలం కాన్సెప్ట్ ను తెరపైకి తెచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల పేదకుటుంబాలకు సెంటు స్థలం పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఉగాది నుంచే ఈ స్కీమ్ ప్రారంభించారు. కొంతమందికి స్థలాలు సైతం కేటాయించారు. మిగిలిన వారికి సైతం ఇళ్లస్థలాలు కేటాయింపు చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అనుకున్నట్లుగానే ఇరవైఐదు లక్షల మందికి సెంటు స్థలాలు పంపిణీ చేయగలిగితే.. ఒక్కో కుటుంబం నుంచి నాలుగు ఓట్లేసుకున్నా దాదాపుగా కోటిమందికి ప్రత్యక్షంగా ప్రభుత్వం నుంచి లబ్ది చేకూరినట్లవుతుంది. అంటే తమ పాకెట్ లో కోటి ఓట్లున్నట్లే అన్నది వైసీపీ సర్కార్ ఆలోచనగా కనిపిస్తోంది.













