Kodali Nani: ఇప్పుడు నానీ వంతు వచ్చిందా…?
మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని(Kodali Nani) విషయంలో గుడివాడ పోలీసులు సీరియస్ గా అడుగులు వేస్తున్నారు. వైసిపి హాయంలో ఆయన చేసిన అవినీతి అక్రమాలను ఇప్పుడు పోలీసులు బయటకు తీసేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో.. పోలీసులు స్పీడ్ పెంచారు. అప్పట్లో కొడాలి నాని గుడివాడలో చేసిన కబ్జా వ్యవహారాలపై నివేదిక కావాలని రెవిన్యూ శాఖ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం.
ముఖ్యంగా గుడివాడ పట్టణంలోని కీలక ప్రాంతాల్లో కొడాలి నాని కొన్ని స్థలాలను తక్కువ ధరకు కొనుగోలు చేశారని, యజమానులను బెదిరించి వాటిని సొంతం చేసుకున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. దీనిపై టిడిపి అనుకూల మీడియా కొన్ని సాక్షాలను కూడా అప్పట్లో బయటపెట్టింది. ఇప్పుడు ఆ వ్యవహారాన్ని మరింత లోతుగా విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే పోలీసులు దీనికి సంబంధించి కీలక ఆధారాలను కూడా సేకరించినట్లు వార్తలు వస్తున్నాయి. వల్లభనేని వంశీ మోహన్(Vallabhaneni Vamshi) తో కలిసి గుడివాడ నియోజకవర్గంలోని కొన్ని కీలక ప్రాంతాల్లో పొలాలను కూడా తక్కువ ధరకు కొనుగోలు చేసినట్లు ప్రచారం జరిగింది.
అలాగే తనకు వ్యతిరేకంగా ఉండే కొంతమందిని కావాలనే కొడాలి నాని ఇబ్బంది పెట్టినట్లు కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. వీటన్నింటిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అలాగే బాధితులతో కూడా అధికారులు నేరుగా మాట్లాడేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దల వద్ద ఉన్న ఆధారాలను ఇప్పటికే పోలీసులకు కూడా అందించినట్లు సమాచారం. అలాగే మద్యం కుంభకోణం విషయంలో కొడాలి నాని పేరు కూడా అప్పట్లో వినపడింది. ఇక రేషన్ బియ్యం అక్రమాల విషయంలో కూడా మాజీ మంత్రి పేర్ని నానితో కలిసి కొడాలి నాని అక్రమాలకు పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు వాటిని కూడా బయటపెట్టేందుకు సిద్ధమవుతున్నారు.













