RGV: వర్మకు మరో షాక్ ఇచ్చిన ఏపీ సర్కార్
వైసీపీ ప్రభుత్వంలో వైసిపి పెద్దల ఆదేశాల మేరకు నడుచుకున్న కొందరు ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందులో సినిమా వాళ్లు కూడా ఉండటం కాస్త ఆందోళన కలిగించే అంశం. ప్రధానంగా ప్రముఖ సినిమా దర్శకుడు రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) గతంలో వైసిపి నేతలకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ నేతలకు అలాగే జనసేన పార్టీ నేతలకు వ్యతిరేకంగా కొన్ని ప్రచారాలు చేస్తూ వచ్చారు. ఆయన కొన్ని సినిమాలు కూడా తీసి వారిని అవమానించే విధంగా వ్యవహరించారు అనే ఆరోపణలు కూడా వినిపించాయి.
వ్యూహం సినిమా విషయంలో రాంగోపాల్ వర్మ అనుసరించిన వైఖరి… అలాగే అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అంటూ ఒక సినిమా తీసి దాంట్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబును అలాగే ఆయన కుటుంబ సభ్యులను అవమానించారు. అదే సినిమాలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ని కూడా అవమానించారు రాంగోపాల్ వర్మ. ఇక ఆ తర్వాత వ్యూహం సినిమాలో రాంగోపాల్ వర్మ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఈ నేపథ్యంలో ఆయనపై నెలరోజుల క్రితం రాష్ట్రవ్యాప్తంగా పలు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో ఆయనను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరిగినా ఇప్పటివరకు ముందడుగు పడలేదు.
ఇక హైకోర్టుకు వెళ్లి రాంగోపాల్ వర్మ ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకున్నారు. ఈ తరుణంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ కార్పోరేషన్ ఆయనకు షాక్ ఇచ్చింది. వ్యూహం సినిమాకు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం నుంచి నిధులు పొందటంపై నోటీసు పంపింది ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్. ఇటీవల దీనికి సంబంధించి ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ జీవీ రెడ్డి మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్క వ్యూకు ఆయనకు భారీగా చెల్లించింది అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో వ్యూహం సినిమాకు అసలు వ్యూస్ లేకుండా ఫైబర్ నెట్ నుంచి 1.15 కోట్ల రూపాయలను అనుచిత లబ్ధి పొందారని లీగల్ నోటిస్ పంపించింది ఫైబర్ నెట్. చైర్మన్ జీవీ రెడ్డి ఆదేశాల మేరకు నాటి ఫైబర్ నెట్ ఎండితో సహా 5 మందికి నోటీసులు పంపించారు. నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి పొందినందున 15 రోజుల్లోపు వడ్డీతో సహా మొత్తం కట్టాలని ఆదేశాలు ఇచ్చారు.













