YSR: వైఎస్సార్ పేరు మార్చిన చంద్రబాబు..! కేడర్ కళ్లలో ఆనందం.!!
మహనీయులను స్మరించుకోవడం మనకు అలవాటు. వాళ్లు సమాజానికి చేసిన సేవలను గుర్తు చేసుకునేలా వీధీలకు, ఊళ్లకు, జిల్లాలకు, సంస్థలకు వాళ్ల పేర్లు పెట్టుకుంటూ ఉంటాం. అది వాళ్లకు మనమిచ్చే గౌరవం. అయితే ఈ సంప్రదాయాలకు రాజకీయ రంగు పులమడం ఇటీవల సర్వసాధారణం అయిపోయింది. తమకు నచ్చిన నేతల పేర్లను సంబంధం లేని వాటికి కూడా పెట్టేసుకుంటూ జనంపై రుద్దుతున్నారు. వీటిని సహించలేని కొందరు ఆ పేర్లు తొలగించాలంటూ ఉద్యమాలు చేస్తున్నారు. ఇలా ఊళ్ల పేర్లు కూడా రాజకీయం కావడంతో ప్రభుత్వాలు మారిన ప్రతిసారీ అవి కూడా మారుతున్నాయి.
దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి (YS Rajasekhar Reddy) హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత ఆయన గుర్తుగా వైఎస్ జన్మించిన కడప జిల్లాకు (Kadapa District) వైఎస్ఆర్ కడప జిల్లాగా (YSR Kadapa District) నామకరణం చేసింది. దీనిపై ఎవరికీ అభ్యంతరం లేదు. కడప జిల్లా పేరును విశ్వవ్యాప్తం చేసిన ఘనత ఆయనకు ఉంది. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కడప పేరును తొలగించి కేవలం వైఎస్ఆర్ జిల్లాగా (YSR District) నామకరణం చేశారు. దీనిపై అనేక మంది అభ్యంతరం తెలిపారు. కడపను ఆ తిరుమలేశుని తొలి గడపగా చెప్పుకుంటారు. అందుకే దీన్ని దేవుని కడప (Devuni Kadapa) అని పిలుస్తుంటారు. అలాంటి కడప పేరునే లేకుండా చేయడమేంటని ధ్వజమెత్తారు. కానీ జగన్ పట్టించుకోలేదు.
అదే విధంగా విజయవాడ శివారులో తాడిగడప (Tadigadapa) మున్సిపాలిటీ ఉంటుంది. గతంలో ఇది గ్రామపంచాయితీగా ఉండేది. జగన్ హయాంలో కొన్ని గ్రామాలను దీని పరిధిలోకి తీసుకొచ్చి దీన్ని మున్సిపాలిటీగా మార్చారు. దీనికి వైఎస్సార్ తాడిగడప (YSR Tadigadapa) అని నామకరణం చేశారు. వాస్తవానికి తాడిగడపకు వైఎస్సార్ కు ఎలాంటి సంబంధం లేదు. జగన్ అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ల తండ్రి పేరును పెట్టారంతే. దానికి నాటి ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి కొలుసు పార్థసారథి (Kolusu Parthasarathy) ఒప్పుకున్నారు. దీంతో తాడిగడప పేరు వైఎస్సార్ తాడిగడపగా మారింది.
అయితే ఇప్పుడు ఈ రెండు పేర్లను మార్చేస్తూ చంద్రబాబు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్ జిల్లా పేరును వైఎస్సార్ కడప జిల్లాగా మార్చింది. అలాగే వైఎస్సార్ తాడిగడప పేరును తాడిగడపగా మార్చింది. దీంతో టీడీపీ కేడర్ సంతోషం వ్యక్తం చేసింది. వాస్తవానికి ఈ పేర్లు మార్చాలని టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేడర్ కోరుతోంది. ఆయా జిల్లాల నేతలు, ఎమ్మెల్యేలు ఈ పేర్లు మార్చాలని ప్రభుత్వానికి లేఖలు కూడా ఇచ్చారు. అయినా ప్రభుత్వం పది నెలలపాటు వీటిని పట్టించుకోలేదు. దీంతో కేడర్ కూడా ఇదయ్యే పని కాదులే.. అని సోషల్ మీడియాలో నిట్టూర్చారు. సహజంగా చంద్రబాబు ఇలాంటి నిర్ణయాలని నాన్చుతూ ఉంటారు. కానీ చంద్రబాబు ఇప్పుడు సాహసోపేత నిర్ణయం తీసుకుని వైఎస్సార్ పేర్లు మార్చేశారు.













