Kadapa Mayor: వైసీపీకి మరో షాక్: కడప మేయర్ సురేష్ బాబుపై వేటు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (AP Politics) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP)కి మరో ఎదురుదెబ్బ తగిలింది. కడప మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సురేష్ బాబును (Suresh Babu) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేయర్ పదవి నుంచి తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అవినీతి ఆరోపణలు, మున్సిపల్ చట్ట ఉల్లంఘనలతో విజిలెన్స్ విచారణలో నిర్దోషిత్వం నిరూపించుకోలేకపోవడంతో ఈ చర్య తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
సురేష్ బాబుపై వచ్చిన ప్రధాన ఆరోపణ ఆయన కుటుంబ సభ్యులకు చెందిన వర్ధిని కన్స్ట్రక్షన్స్ (Vardhini Constructions) అనే సంస్థకు కడప మున్సిపల్ కార్పొరేషన్‌లో (Kadapa Muncipal Corporation) కాంట్రాక్టు పనులు కేటాయించడం. ఈ సంస్థలో డైరెక్టర్లుగా ఉన్న కె.అమరేష్, జయశ్రీలు సురేష్ బాబు కుటుంబ సభ్యులు. మున్సిపల్ యాక్ట్ 1955 ప్రకారం.. ప్రజా ప్రతినిధులు లేదా వారి కుటుంబ సభ్యులు కాంట్రాక్టు పనులు చేపట్టడం చట్టవిరుద్ధం. ఈ నిబంధనను సురేష్ బాబు ఉల్లంఘించినట్లు విజిలెన్స్ విచారణలో తేలింది.
కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి (Kadapa MLA Madhavi Reddy) ఈ అవినీతి ఆరోపణలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో విజిలెన్స్ విభాగం విచారణ చేపట్టింది. విచారణలో సురేష్ బాబు కుటుంబ సభ్యుల ద్వారా కాంట్రాక్టు పనులు చేపట్టినట్లు ఆధారాలు లభించాయి. ఈ నేపథ్యంలో పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ బాబును అనర్హత వేటు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 28న సురేష్ బాబుకు షోకాజ్ నోటీసు జారీ చేసిన ప్రభుత్వం, అనర్హత వేటు ఎందుకు విధించకూడదో 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీనిపై సురేష్ బాబు హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు రెండుసార్లు గడువు పొడిగించింది. మే 13న మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎదుట హాజరై వివరణ ఇచ్చినప్పటికీ.. అది సంతృప్తికరంగా లేకపోవడంతో ప్రభుత్వం ఆయన్ను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
సురేష్ బాబు తొలగింపును వైసీపీ తీవ్రంగా ఖండించింది. ఈ చర్యను కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు రాజకీయాలకు నిదర్శనమని అభివర్ణించింది. సురేష్ బాబును కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి రాజకీయంగా ఎదుర్కోలేక ఈపని చేశారని ఆరోపించారు. సురేష్ బాబు కడప అభివృద్ధికి చేసిన కృషిని కూటమి ప్రభుత్వం సహించలేకపోతోందఅని వైసీపీ నాయకులు పేర్కొన్నారు. మరోవైపు సురేష్ బాబు అవినీతితో కడప నగరాన్ని నాశనం చేశారని కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఆరోపించారు. విజిలెన్స్ నివేదిక స్పష్టంగా ఆయన తప్పిదాలను బయటపెట్టిందన్నారు. ఇది అవినీతిపై కూటమి ప్రభుత్వం తీసుకున్న నిష్పక్షపాత చర్య అని ఆమె సమర్థించుకున్నారు.
కడపలో వైసీపీకి కీలక నాయకుడైన సురేష్ బాబును మేయర్ పదవి నుంచి తొలగించడం ఆ పార్టీకి పెద్ద దెబ్బగా చెప్పవచ్చు. కడప మున్సిపల్ కార్పొరేషన్‌లో వైసీపీకి స్పష్టమైన ఆధిక్యత ఉంది.