Ambati Rambabu: తర్వాతి టార్గెట్ రాంబాబేనా…?
తమ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అన్ని విధాలుగా చెలరేగిపోయిన వైసీపీ(YSRCP) నేతల విషయంలో ఇప్పుడు పోలీసులు దూకుడు పెంచారు. రాజకీయంగా వైసిపి బలాన్ని అడ్డం పెట్టుకుని కొంతమంది మాజీ మంత్రులు అప్పట్లో అక్రమంగా సంపాదించారు అని ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపించాయి. ముఖ్యంగా అప్పట్లో చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే, విడదల రజనీపై పెద్ద ఎత్తున అక్రమాలకు సంబంధించి టిడిపి ఆరోపణలు చేసింది. నియోజకవర్గంలో బడా వ్యాపారవేత్తలను బెదిరిస్తున్నారని మండిపడింది.
2019 ఎన్నికల్లో తన పెట్టిన ఖర్చుని ఎలాగైనా సరే తిరిగి సంపాదించుకోవాలని ఆమె టార్గెట్ పెట్టుకుని పని చేసింది అంటూ పెద్ద ఎత్తున టిడిపి(TDP) సోషల్ మీడియాలో సైతం ప్రచారం నిర్వహించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆమెపై విచారణకు ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇటీవల ఆమెపై కేసు నమోదు చేసేందుకు గవర్నర్ కు లేఖ కూడా ఏసీబీ అధికారులు రాశారు. మాజీ మంత్రి కావడంతో గవర్నర్ అనుమతి తీసుకుంటే ఆ తర్వాత న్యాయపరమైన చిక్కులు రావని ఎసిబి వ్యూహాత్మకంగా వ్యవహరించింది.
ఇక ఇప్పుడు మరో మాజీ మంత్రి అంబటి రాంబాబు పై ఫోకస్ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. వైసిపి ప్రభుత్వం హయాంలో అంబటి రాంబాబు తో పాటుగా ఆయన సోదరుడు అంబటి మురళీకృష్ణ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని టిడిపి విమర్శలు చేసింది. ఇప్పుడు వాటిపై విచారణకు ఏసీబీ అధికారులతో పాటుగా సిఐడి అధికారులు కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పక్క ప్రణాళిక ప్రకారం.. ముందుకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. అంబటి మురళీకృష్ణ పై టిడిపి ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన సందర్భాలు ఉన్నాయి. భూ కబ్జాలు తో పాటుగా సహకార బ్యాంకుల్లో రుణాల విషయంలో కూడా ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు వాటిని కూడా నెగ్గు తేల్చేందుకు ఏసీబీ అధికారులు రెడీ అవుతున్నారు.













