ఏపీకి మరో ఎలక్ట్రానిక్స్ దిగ్గజం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎలక్ట్రానిక్స్ హబ్‌గా తీర్చిదిద్దాలని చేస్తున్న ప్రయత్నాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు మరో విజయం సాధించారు. ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీరంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీల్లో ఒకటైన ప్లెక్స్ (ప్లెక్స్ ట్రానిక్స్) సంస్థ రాష్ట్రంలో భారీ ఎత్తును పెట్టుబడులుపెట్టేలా ముఖ్యమంత్రి ఒప్పించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేష్‌తోనూ ప్లెక్స్ సంస్థ ప్రతినిధులు సమావేశమయ్యారు. తిరుపతి సమీపంలో రూ.585 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తంచేసిన ప్లెక్స్ ప్రతినిధులు ఈ మేరకు ముఖ్యమంత్రి సమక్షంలో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్శాఖతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఎలక్ట్రానిక్స్, హార్డ్‌వేర్ విడిభాగాల తయారీలో ఖ్యాతిగాంచిన ప్లెక్స్ రాకతో సుమారుగా 6,600 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. 30కి పైగా దేశాల్లో 2 లక్షలకు పైగా ఉద్యోగస్తులతో ప్లెక్స్ సంస్థ తమ కార్యకలాపాలను ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తోంది. ప్లెక్స్ సంస్థలను ఆకట్టుకునేందుకు దేశంలోని పలు రాష్ట్రాలు తీవ్ర ప్రయత్నాలు చేశాయి. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు చూపిన చొరవతో ఆ సంస్థ ప్రతినిధులు మన రాష్ట్రానికి వచ్చారు. ప్లెక్స్ రాకతో మరిన్ని అగ్రగామి సంస్థలు రాష్ట్రానికి రావడానికి అవకాశాలు విస్తృతమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ని ఎలక్ట్రానిక్స్, హార్డ్‌వేర్ రంగాల్లో అగ్రస్థానాన నిలబెడతామని, పరిశ్రమలకు అవసరమైన అన్ని మౌలిక వసతులను రాష్ట్రంలో కల్పిస్తున్నామని ప్లెక్స్ ప్రతినిధులకు ముఖ్యమంత్రి వివరించారు. పెట్టుబడులకు ప్రధాన ఆకర్షణ కేంద్రంగా ఏపీని తీర్చి దిద్దుతామన్నారు.













