వీఎంఆర్డీఏ పరిధిలోకి మరిన్ని గ్రామాలు
విశాఖలోని గిరిజనేతర ప్రాంతం మొత్తాన్నీ విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ కిందికి తీసుకొస్తూ ఏపీ ప్రభుత్వం ఓ నోటిఫికేషన్ను విడుదల చేసింది. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. నర్సీపట్నం, చోడవరం, మాడుగుల, రావికమతం, బుచ్చయ్యపేట, నాతరవరం, కె.కోటపాడు, దేవరపల్లి, మాకవరపాలెం, కోటవురట్ల, గొలుగొండ, రోలుగుంట, చీడికాడ మండలాల పరిధిలోని 431 గ్రామాలను ఈ పరిధిలో చేర్చింది ప్రభుత్వం. జిల్లాలో మొత్తం 43 మండలాలుండగా, అందులో 19 మండలాలు ఇప్పటికే వీఎంఆర్డీఏ పరిధిలోకి వచ్చేశాయి. 11 మండలాలు మాత్రం ఏజెన్సీలో ఉన్నాయి. వీటిని మినహాయించి, మిగతా 13 మండలాలను రాష్ట్ర ప్రభుత్వం ఈ పరిధిలోకి తెచ్చింది.
మరోవైపు విశాఖ బీచ్ కారిడార్ ప్రాజెక్టును తొందరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. దీన్ని మొదటి ప్రాధాన్యతగా పరిగణనలోకి తీసుకొని పూర్తి చేయాలని అన్నారు. బీచ్ కారిడార్ ప్రాజెక్టుతో పాటు భోగాపురం విమానాశ్రయం అంశంపై కూడా దృష్టి పెట్టాలని ఆదేశించారు. భీమిలి నుంచి భోగాపురం వరకూ రోడ్డు నిర్మాణానికి 1,167 కోట్లు ఖర్చవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేధారు. రానున్న 30 ఏళ్లు విశాఖకు నీటి అవసరాలను తీర్చేలా పైప్లైన్లను నిర్మించాలని జగన్ కోరారు.













