ఏపీలోనూ పదో తరగతి పరీక్షలు రద్దు? రేపు కీలక నిర్ణయం!
ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షల నిర్వహణపై సందిగ్ధత కొనసాగుతోంది. ఇప్పటికే సీబీఎస్ఈతో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా పదో తరగతి పరీక్షలు రద్దు చేసింది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికైతే తమకు అలాంటి ఆలోచన లేదని.. పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని చెప్తోంది. అయితే కోరనా కేసులు భారీగా పెరుగుతుండడంతో ప్రభుత్వం వేచి చూసే ధోరణి వలంబిస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే పరీక్షలు నిర్వహించగలమా.. లేకుంటే రద్దు చేయాలా.. అనే అంశాలపై తర్జన భర్జన పడుతోంది.
కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మిగిలిన రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. కానీ ఏపీలో మాత్రం ఇప్పటికీ స్కూళ్లు నడుస్తున్నాయి. కేసులు పెరిగిపోతున్నా స్కూళ్ల నిర్వహణపై ప్రభుత్వం వెనక్కు తగ్గట్లేదు. అయితే ఇప్పుడు పరిస్థితి మరీ విషమిస్తోంది. దీంతో పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. పరీక్షలు జరుగుతాయా.. లేదా.. అని విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తప్పనిసరిగా ప్రకటించాల్సిన అవసరం ఏర్పడుతోంది.
ఏపీలో ప్రస్తుతం రోజుకు 7వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. చిత్తూరు, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో కేసుల సంఖ్య మరీ ఎక్కువగా ఉంది. దీంతో పాఠశాలలు, పరీక్షలు నిర్వహించలేని పరిస్దితి ఏర్పడుతోంది. పదో తరగతి పరీక్షల గడువు ముంచుకొస్తుండడంతో.. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది. గతేడాది కరోనా వల్ల స్కూళ్లు ఆలస్యంగా తెరుచుకున్నాయి. దీంతో ఈ ఏడాది జూన్ లో పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఏప్రిల్ నుంచే కరోనా కేసుల విజృంభణ మొదలైంది. మే, జూన్ లలో ఈ సంఖ్య మరింత భయంకంరంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలను రద్దు చేసిన పన్నెండో తరగతి పరీక్షలను వాయిదా వేసింది. తెలంగాణ ప్రభుత్వం కూడా టెన్త్, జూనియర్ ఇంటర్ పరీక్షలను రద్దు చేసింది. సెకండియర్ పరీక్షలను మాత్రం వాయిదా వేసింది. కానీ ఏపీ సర్కార్ మాత్రం ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సీబీఎస్ఈ, తెలంగాణ తీసుకున్నట్టుగానే ఏపీ కూడా పరీక్షలు రద్దు చేయాలనే డిమాండ్ ఓ వైపు వినిపిస్తోంది. పరీక్షలపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ పరిణామాలను సీఎం వై.ఎస్.జగన్ నిశితంగా పరిశీలిస్తున్నారు. పరీక్షల నిర్వహణకు కరోనా వ్యాప్తి ఆటంకంగా మారుతుందనే అంచనాల నేపథ్యంలో సోమవారం దీనిపై సమీక్ష నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. ఇంటర్ పరీక్షలపై ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోకపోయినా.. పదో తరగతి పరీక్షలపై మాత్రం కీలక నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. టెన్త్ పరీక్షలను రద్దు చేసేందుకే మొగ్గు చూపొచ్చని తెలుస్తోంది.













