ఏపీలో రిలయన్స్ భారీ పెట్టుబడులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ, పెట్రోలియం రంగాల్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ ముందుకొచ్చింది. రూ.55వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో రెండు కీలక ఒప్పందాలు చేసుకుంది. విశాఖపట్నంలో జరుగుతున్న భాగస్వామ్య సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు సక్షంలో ఈ ఒప్పందాలు జరిగాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీఎంఎస్ ప్రసాద్, రిలయన్స్ జియో డిజిటల్ సర్వీసెస్ విభాగం అధ్యక్షుడు కిరణ్ థామస్, ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి లోకేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మొదటి ఒప్పందంలో భాగంగా రియలన్స్ ఇండస్ట్రీస్ సంస్థ రూ.15 వేల కోట్లు నేరుగా పెట్టుబడి పెడుతుంది. తిరుపతి సమీపంలో 150 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ పార్కు ఏర్పాటు చేస్తోంది. 10 లక్షల జియోఫోన్లు ఉత్పత్తి చేసే యూనిట్, సెట్‌టాప్ బాక్స్ తయారీ పరిశ్రమ, చిప్ డిజైనింగ్ యూనిట్ వంటివి ఏర్పాటు చేస్తారు. రాజధాని అమరావతిలో 100 ఎకరాల్లో ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేస్తుంది. ఇది ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్, స్టార్ట్ప్, వెంచర్ క్యాపిటల్, పరిశోధన కేంద్రంగా పనిచేస్తుంది. ఈ రెండు ప్రాజెక్టుల్లో సుమారు 20 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రిటిష్ పెట్రోలియం సంస్థల సంయుక్త భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మరో ఒప్పందం జరిగింది. దీని విలువ 40వేల కోట్లు. దీనిలో భాగంగా కృష్ణా, గోదావరి బేసిన్లో సహజ వనరుల వినియోగానికి సంబంధించిన మూడు ప్రాజెక్టులు చేపడతారు. ఇన్ఫరేషన్ టెక్నాలజీ రంగంలో రిలయన్స్ విప్లవాత్మక మార్పులు తెస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. ప్రజలకు ఉత్తమ సేవలందించాలన్నదే ముకేశ్ అంబానీ ఆంకాక్ష అని చంద్రబాబు పేర్కొన్నారు.













