ఏపీలో కర్ఫ్యూ మాటున లాక్ డౌన్..! ఇంతలోనే ఎంత మార్పు..!?

ఆంధ్రప్రదేశ్ లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య 20వేలు దాటింది. మరణాల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించింది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా 18 గంటల కర్ఫ్యూ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇవాల్టి నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వస్తున్నాయి. అత్యవసర సేవలు మినహా అన్నింటిని నిలిపేస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఒక విధంగా చెప్పాలంటే ఏపీలో కర్ఫ్యూ మాటున నిర్బంధ లాక్ డౌన్ అమలు కానుంది. నిన్న మొన్నటి వరకూ కరోనాను లైట్ తీసుకున్న ఏపీ సర్కార్ ఇప్పుడు కఠిన ఆంక్షలు విధించడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా విలయతాండవం చేస్తున్నా పది, ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకే జగన్ ప్రభుత్వం మొగ్గు చూపింది. కష్టకాలమే అయినా పరీక్షలు నిర్వహించకపోతే విద్యార్థులు నష్టపోతారని.. వారి భవిష్యత్తుకోసమే పరీక్షలు పెడుతున్నామని సాక్షాత్తూ సీఎం జగనే స్పష్టం చేశారు. కరోనా కల్లోలం వేళ పరీక్షలు నిర్వహించడమేంటని సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. పరీక్షలను వాయిదా వేయాలని లేదా రద్దు చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపించాయి. అయినా ప్రభుత్వం ససేమిరా అంది. అయితే ఈ అంశం హైకోర్టు దృష్టికి వెళ్లడంతో పరీక్షలపై పునరాలోచించాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో వెనక్కు తగ్గిన ప్రభుత్వం పరీక్షలను వాయిదా వేసింది. లేకుంటే ఇవాల్టి నుంచి ఏపీలో ఇంటర్ పరీక్షలు జరగేవి.
కరోనా విజృంభిస్తున్న వేళ కూడా పరీక్షలు పెట్టి పిల్లల్ని బలిచేయడమేంటని పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే వాటిని లెక్కచేయకుండా ముందుకే వెళ్లాలనుకున్న ప్రభుత్వం చివరి నిమిషంలో వెనక్కు తగ్గింది. అయితే ఇప్పుడు ఏకంగా రాష్ట్ర సరిహద్దులను కూడా మూసేస్తూ సంచల నిర్ణయం తీసుకుంది. 18 గంటల పాటు నిర్బంధ కర్ఫ్యూ అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే షాపులు తదితరవాటికి పర్మిషన్ ఇచ్చింది. 12 తర్వాత మాత్రం అన్నీ బంద్ చేయాల్సిందే. ఒక విధంగా చెప్పాలంటే కర్ఫ్యూ మాటున సంపూర్ణ లాక్ డౌన్ అమలు కానుంది. అత్యవసర సేవలు మినహా మిగిలినవన్నీ నిలిచిపోనున్నాయి.
అన్నిటికీ మించి అంతర్రాష్ట్ర సరిహద్దులను కూడా మూసేయడం చర్చనీయాంశమైంది. కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు అంతరాష్ట్ర సరిహద్దులను మూయవద్దని ఆదేశించాయి. కేసులు ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, ఢిల్లీ లాంటి రాష్ట్రాలు కూడా అంతర్రాష్ట్ర సరిహద్దులను మూసేశాయి. కొన్ని రాష్ట్రాలు మాత్రం కోవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ తీసుకురావాలని, ఈ పాస్ తీసుకోవాలని సూచించాయి. అంతేకానీ బోర్డర్స్ మాత్రం మూసేయలేదు. కానీ ఏపీలో అలా లేదు. అత్యవసర సర్వీసులు మినహా ప్రైవేటు, ప్రభుత్వ రవాణా మొత్తాన్ని నిలిపేస్తున్నట్టు ప్రకటించింది. ప్రయాణికుల ప్రైవేటు వాహనాలను కూడా అనుమతించబోమని స్పష్టం చేసింది. దీంతో సరిహద్దులు మూసేసినట్లే భావించాలి. నిన్నమొన్నటి వరకూ కరోనాను లైట్ తీసుకున్న ప్రభుత్వం ఇప్పుడు ఒక్కసారిగా ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.