కరోనా వేవ్ ఎదుర్కోవడానికి జగన్ కీలక ఆదేశాలు, నిరుద్యోగులకు గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత ప్రజలను బాగా ఇబ్బంది పెడుతున్న మాట వాస్తవం. ఏపీ సర్కార్ చర్యలు కూడా పెద్దగా ఫలితాన్ని ఇవ్వకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది. ఇక కరోనా మరణాలు కూడా భారీగా ఉండటం కీలక నగరాల్లో చావులు భారీగా ఉన్నాయనే వార్తలు రావడంతో ఏపీ సర్కార్ చర్యలను కాస్త జాగ్రత్తగానే తీసుకుంటుంది. వేలాది మంది కరోనా బారిన పడటంతో వైద్య రంగం కూడా ఇబ్బందులు ఎదుర్కొంటుంది అనే మాట వాస్తవం. కరోనా కేసుల కట్టడికి ఇప్పుడు సిబ్బంది కొరత కూడా సర్కార్ ని ఇబ్బంది పెడుతుంది.
దాదాపుగా ప్రభుత్వ వైద్యులు కూడా ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపధ్యంలో కొవిడ్ రెండోదశను ఎదుర్కొనేందుకు పెద్ద ఎత్తున నియామకాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొవిడ్ ఆసుపత్రులలో నియామకానికి జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్పెషలిస్టులు , మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సులు, సిబ్బంది నియామకం చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముద్దాడ రవిచంద్ర ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసారు. కొవిడ్ తో బాధపడుతున్న పేషెంట్లకు ఇక పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించాలని నిర్ణయం తీసుకున్నారు ఆయన.
కొవిడ్ నిర్వహణకు మెడికల్ ఆఫీసర్లు, స్పెషలిస్టు లు, స్టాఫ్ నర్సులను నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. 1170 స్పెషలిస్టులు , 1170 జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ల నియామకం చేపట్టాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. 2 వేల మంది స్టాఫ్ నర్సులు, 300 మంది అనస్థీషియా టెక్నీషియన్ల నియామకానికి ఉత్తర్వులు జారీ చేసారు. అలాగే 300 మంది ఎఫ్ ఎన్ వోలు , 300 మంది ఎమ్మెన్వోల నియామకం చేపట్టాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. 300 మంది స్వీపర్ల నియామకానికి ముద్దాడ ఉత్తర్వులు జారీ చేసారు. అందర్నీ ఆరు నెలల కాలపరిమితి కి గాను కాంట్రాక్టు పద్ధతిలో నియామకం చేపట్టాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. కొవిడ్ ఆసుపత్రులలో యుద్ధ ప్రాతిపదికన నియామకాలు చేపట్టాలని స్పష్టంగా పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్ తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో వివరించారు.













