ఆంధ్రప్రదేశ్ కు 19 అవార్డులు
ఉపాధి హామీ పథకం, సామాజిక భద్రతా పథకాల అమలు తీరుపై కేంద్ర ప్రభుత్వం ఏటా ఇచ్చే అవార్డుల్లో వివిధ విభాగాల్లో ఆంధ్రప్రదేశ్ 19 అవార్డులు కైవశం చేసుకుంది. న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చేతులు మీదుగా రాష్ట్రం తరపున గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ రామాంజనేయులు, అదనపు కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం ఈ అవార్డులను తీసుకున్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం అమల్లో ఉత్తమ జిల్లాగా విజయనగరం ఎంపికవగా, ఆ జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ రామాంజనేయులు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి ఇన్ని అవార్డులు రావడం పట్ల గర్విస్తున్నామని, రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేయాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనకు అనుగుణంగా రాష్ట్రంలో కార్యక్రమాలు అమలు జరుగుతున్నందుకు జాతీయ స్థాయిలో అవార్డులు లభించాయన్నారు.













