అమరావతి పూర్తి చేసి వచ్చే ఎన్నికలకు టీడీపీ..?
ఏపీ నూతన రాజధాని అమరావతి నిర్మాణం లక్ష్యంగా కూటమి సర్కార్ అడుగులేస్తోంది. ఓవైపు కేంద్రం నుంచి 15 వేల కోట్లు రుణం, మరోవైపు ప్రపంచబ్యాంక్ నుంచి రుణం.. ఇలా అన్నివైపుల నుంచి నిధులను సమీకరిస్తోంది. రుణాల లభ్యం పూర్తయితే.. అమరావతి నిర్మాణానికి కౌంట్ డౌన్ స్టార్టవుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే అమరావతి గురించి మంత్రి నారాయణ తీపి కబురు అందించారు.డిసెంబర్ 1 నుంచి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభమవుతాయన్నారు మంత్రి నారాయణ. గతంలో అమరావతి గురించి చంద్రబాబు సర్కార్ ఘనంగా ప్రకటించుకుంది. తిరుగులేని రాజధాని, నవనగరాలు అంటూ ప్రకటనలు చేసింది.
అయితే ఎన్నికల సమయానికి మాత్రం కొన్ని తాత్కాలిక భవనాలు తప్ప ఇంకేమీ పూర్తి చేయలేకపోయింది. దీంతో అవన్నీ చంద్రబాబు ట్రేడ్ మార్క్ గ్రాఫిక్స్ అంటూ వైసీపీ ప్రచారం చేసి, ఎన్నికల్లో విజయం దక్కించుకుంది. ఈ ఐదేళ్లపాటు అమరావతి ఊసు ఎత్తకుండా వైసీపీ పాలన సాగించింది. అయితే వైసీపీ సర్కార్ కు వ్యతిరేకంగా ఓటు పడడంతో ఈసారి కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. తొలి ప్రాధాన్యత అమరావతి నిర్మాణంగా తీసుకున్న కూటమి ప్రభుత్వం… ఈ టర్మ్ కంప్లీట్ అయ్యేలోగా అమరావతిని పూర్తి చేయాలని కూడా గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అమరావతి రాజధానిని నిర్మించిన తరువాతనే ఎన్నికలకు వెళ్లాలని కూడా చంద్రబాబు పట్టుదల మీద ఉన్నట్లు తెలుస్తోంది..
అందుకే అధికారంలోకి వచ్చిన తరువాత డే వన్ నుంచి ఆయన ఇదే పని మీద ఉన్నారు. ఈ విషయంలో కేంద్ర పెద్దలను ఒప్పించారు. ప్రపంచ బ్యాంకు నుంచి రుణాన్ని భారీ ఎత్తున పొందగలిగారు. ఇక అమరావతి రాజధాని నిర్మాణానికి వడివడిగానే అడుగులు పడుతున్నాయి. ఆర్ధికంగా దన్ను ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వం పూర్తి సానుకూలంగా ఉండడంతో అమరావతికి పెట్టుబడులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నాయి. దానికి తోడు చంద్రబాబు పలుకుబడితో కూడా అనేక పరిశ్రమలకు అమరావతి బాట పట్టనున్నాయి. అమరావతికి ఒక రూట్ వేస్తే చాలు అభివృద్ధి అందుకుంటుంది అన్న అంచనాలు ఉన్నాయి. అయితే గతంలో లక్ష కోట్ల రూపాయలు అమరావతి రాజధానికి కావాలని గత టీడీపీ ప్రభుత్వం అంచనాలు వేసింది.
ఇపుడు మరో అయిదేళ్ళ కాలం గడచిపోయింది కాబట్టి ఆ అంచనా వ్యయం కూడా భారీగా పెరగాలి. కానీ మంత్రి నారాయణ చెబుతున్న దానిని బట్టి చూస్తే సగానికి సగం బడ్జెట్ తగ్గిపోయింది. మరి దానికి కారణం ఏమిటి అన్నది తెలియాల్సి ఉంది. అమరావతికి సంబంధించి గత డిజైన్ల మేరకే ముందుకు సాగుతున్నారా లేక వేరే వారికి ఆ బాధ్యతలు అప్పగించి ప్రభుత్వం తాను అనుకున్న విధంగా నిర్మాణం పనులు పూర్తి చేస్తుందా అన్న చర్చ కూడా ఉంది. ఇంకో వైపు చూస్తే అమరావతిలో అయిదు వందల ఎకరాలతో అతి భారీ పార్క్ ని ఏర్పాటు చేస్తున్నారు. మూడు వందల ఏకరాలతో మరో భారీ పార్క్ ని నిర్మిస్తున్నారు.అంతే కాదు ఇంకో రెండు భారీ పార్కులకు కూడా డిజైన్లలో చోటు ఇచ్చారు. ఇలా చూస్తే కనుక అమరావతి రాజధాని గ్రీన్ అండ్ క్లీన్ గా కూల్ గా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు అని అంటున్నారు. అమరావతి విషయంలో ఎక్కడా రాజీ పడేది లేదని కూడా ప్రభుత్వం అంటోంది.













