బీసీ కార్పొరేషన్ లకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. వచ్చే ఎన్నికల వరకు వాళ్లే..!
అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బీసీలకు అధిక ప్రాధాన్యాన్నిచ్చింది. రాష్ట్రంలో జనాభా పరంగా అధికంగా ఉన్న బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పిస్తూ 55 బీసీ కార్పోరేషన్లను ఏర్పాటు చేసి ఒక్కో కార్పొరేషన్‌కు ప్రత్యేకంగా చైర్మన్, డైరెక్టర్లను నియమించింది. ఈ కార్పొరేషన్లకు రెండేళ్ల పదవీకాలంతో పనిచేస్తాయని చెప్పి, అందులోని అధికారులకు, సభ్యులకు తగిన జీతభత్యాల్ని కూడా కల్పించింది. అయితే 2022 డిసెంబర్ 16తో బీసీ కార్పొరేషన్ల పదవీ కాలం ముగిసింది. అప్పటి నుంచి ఈ అంశంపై చర్చించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కార్పొరేషన్లలోని అధికారుల పదవీ కాలం పొడిగిస్తున్నట్లు శుక్రవారం రాత్రి ప్రత్యేక ఉత్తర్వులను జారీ చేసింది.
ఆ ఉత్తర్వుల ప్రకారం ఈ కార్పొరేషన్ల పనికాలం, అందులో పనిచేసే అధికారుల పదవీ కాలం రెండూ పెరగబోతున్నాయి. అంటే ప్రస్తుతం చైర్మన్లుగా, డైరెక్టర్లుగా ఉన్నవారే ఇకపై కూడా కొనసాగుతారన్నమాట. వీళ్ల పదవీకాలంపై ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు వీళ్లే ఆ బాధ్యతలను నిర్వర్తిస్తారు. అంటే వచ్చే ఎన్నికలతో సంబంధం లేకుండా వచ్చే ప్రభుత్వంలోనూ కార్పొరేషన్ పదవుల్లో కొనసాగే అవకాశం ఉంది. దీంతో వైసీపీ ప్రభుత్వంలో బీసీలకు అధిక ప్రాధాన్యం లభిస్తుందనే మాట మరోసారి రుజువైంది.













