సీఎం ముఖ్య సలహాదారుగా ఆదిత్యనాథ్ దాస్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్య సలహాదారుగా ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆదిత్యనాథ్ దాస్‌కు కేబినెట్ హోదా కూడా ఇస్తున్నట్లు ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్ ఈ నెల 30 మధ్యాహ్నం వరకు పదవిలో కొనసాగుతారు. అనంతరం పదవీ విరమణ చేస్తారు. పదవీ విరమణ అనంతరం ఆయనకు సీఎం ముఖ్య సలహాదారు పదవిని ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ సాధారణ పరిపాలనాశాఖ ముఖ్య కార్యదర్శి రేపు ముత్యాలరాజు ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి అనేక మంది సలహాదారులుండగా, ఇప్పుడు దాస్‌ను మరో సలహాదారుగా నియమించినట్లైంది. ఢిల్లీలోని ఏపీ భవన్ నుంచి ఆయన విధులను నిర్వహిస్తారు. అయితే ఏ విధులు అన్నది తర్వాత ఇచ్చే ఉత్తరుల్లో పేర్కొంటామని స్పష్టం చేశారు.













