బంద్ కు సర్కార్ మద్దతు.. ఇదీ వెరైటీ..!
సాధారణంగా బంద్ అంటేనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతుంటుంది. విపక్షాలు లేదా ఉద్యోగులు లేదా కార్మికులు.. తమ డిమాండ్లు నెరవేర్చుకునే ఉద్దేశంతో బంద్ లు చేస్తుంటారు. వీళ్ల డిమాండ్లకు ప్రభుత్వం సాధారణంగానే ససేమిరా అనే సందర్భాలు మనం చూస్తుంటాం. దీంతో అటు ప్రభుత్వం, ఇటు విపక్షం బెట్టుకుపోయి బంద్ లు జరుగుతుంటాయి. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న బంద్ మాత్రం ఇందుకు విరుద్ధం. అటు ప్రభుత్వం, ఇటు విపక్షం ఏకతాటిపైకి వచ్చి బంద్ చేస్తున్నాయి.
విశాఖ స్టీల్ ప్లాంట్ ను వ్యతిరేకిస్తూ ఐక్యకార్యాచరణ సమితి ఇవాళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చింది. వామపక్షాలు మొదట ఈ డిమాండ్ ను లేవనెత్తాయి. ఆ తర్వాత ఒక్కో పార్టీ తమ మద్దతు ప్రకటించాయి. ప్రతిపక్ష టీడీపీ, జనసేన కూడా ఈ బంద్ కు జైకొట్టాయి. బీజేపీ మాత్రం బంద్ కు మద్దతు తెలపడం కానీ, వ్యతిరేకించడం కానీ చేయట్లేదు. ఓ వైపు ప్రైవేటీకరణ ఇప్పట్లో జరగదంటూనే.. తాము కూడా స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటుపరం చేయొద్దని కోరుతున్నట్టు చెప్తోంది. కానీ బీజేపీ మాటలను ఎవరూ నమ్మట్లేదు. ఓ విధంగా చెప్పాలంటే బీజేపీకి వ్యతిరేకంగా జరుగుతున్న బంద్ ఇది. దీంతో బీజేపీ ఏమీ మాట్లాడలేకపోతోంది.
విశాఖ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఐక్యకార్యాచరణ సమితి బంద్ కు పిలుపునివ్వగానే ప్రభుత్వ వైఖరి ఎలా ఉంటుందనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బంద్ కు సహకరిస్తుందా… లేకుంటే సహజంగానే అణచివేస్తుందా.. అని అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే బంద్ కు ముందు రోజే.. ప్రభుత్వమే తనంతట తాను ముందుకొచ్చి బంద్ కు సర్కార్ కూడా మద్దతునిస్తున్నట్టు ప్రకటించింది. మంత్రి పేర్ని నాని ఈ విషయాన్ని స్వయంగా మీడియాకు వెల్లడించారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ఆర్టీసీ బస్సులను నడపబోమని.. ఆర్టీసీ కార్మికులు కూడా నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరు కావాలని సూచించారు. దీంతో ఆశ్చర్యపోవడం విపక్షాల వంతయింది.
విశాఖ ఉక్కు మరోసారి ఆంధ్రులకు సెంటిమెంట్ గా మారింది. విశాఖ ఉక్కును సాధించుకునే క్రమంలో ఎంతోమంది అశువులు బాశారు. ఇప్పుడు దాన్ని రక్షించుకోవడం కోసం మరోసారి విశాఖ ఉక్కు నినాదాన్ని ఎత్తుకోవాల్సి వచ్చింది. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాల్లో భాగంగా దీన్ని ప్రైవేటీకరించబోతోంది. అయితే రాష్ట్ర బీజేపీకి ఇది అశనిపాతంలా మారింది. కానీ ఏం చేయలేని పరిస్థితి. కానీ కార్మికుల డిమాండ్లు, సెంటిమెంట్ ముడిపడి ఉండడంతో అధికార వైసీపీతో పాటు మిగిలిన పార్టీలన్నీ ఏకతాటిపైకి రాక తప్పలేదు. అందుకే బంద్ కు సంపూర్ణ మద్దతు.













